అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।। 10 ।।
అపర్యాప్తం — అపరిమితమైన; తత్ — అది; అస్మాకం — మన యొక్క; బలం — బలము; భీష్మ — భీష్మ పితామహుడిచే; అభిరక్షితాం — సురక్షితంగా ఏర్పాటుచేయబడ్డ; పర్యాప్తం — పరిమితమైన; తు — కానీ; ఇదం — ఈ; ఏతేషాం — వారియొక్క; బలం — బలము; భీమ — భీముడు; అభిరక్షితాం — సావధానంగా రక్షింపబడుచున్న.
Translation
BG 1.10: మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం, పరిమితమైనది.
Commentary
దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్యకాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది.
భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం. పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు, భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు.
కానీ, భీష్ముడు, కౌరవులకి, పాండవులకీ ఇరువురికీ కూడా పితామహుడే, ఇరు పక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి (భీష్ముడికి) వున్న ప్రేమ, తనను మనస్పూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో, భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు, అని భీష్ముడికి తెలుసు. కానీ, హస్తినాపుర వాసులకి మరియు కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.