Bhagavad Gita: Chapter 1, Verse 23

యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ।। 23 ।।

యోత్స్యమానాన్ — యుద్ధానికి వచ్చినవారు; అవేక్షే అహం — నాకు చూడాలని వుంది; యే — ఎవరు; ఏతే — వారు; అత్ర — ఇక్కడ; సమాగతాః — కూడిఉన్న; ధార్తరాష్ట్రస్య — ధృతరాష్ట్రుని పుత్రునికి; దుర్బుద్ధేః — దుర్భుద్ధి కలవాడు; యుద్ధే — యుద్ధంలో; ప్రియ-చికీర్షవ — సంతోషపెట్టడం కొరకు.

Translation

BG 1.23: దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.

Commentary

పాపిష్టి-బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు, కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి వుందో వారిని ఒకసారి చూడదలచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తుచేస్తూ, దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడి దృక్పథం ఇలా వుంది, ‘న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు, ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు.’

Watch Swamiji Explain This Verse