Bhagavad Gita: Chapter 10, Verse 18

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ।। 18 ।।

విస్తరేణ — విస్తారముగా; ఆత్మనః — నీ యొక్క; యోగం — దివ్య మహిమలు; విభూతిం — విభూతులు (గుణములు/ఐశ్వర్యములు); చ — మరియు; జనార్దన — శ్రీకృష్ణా, జనుల బాగోగులు చూసుకునేవాడా; భూయః — మరలా; కథయ — వివరించుము; తృప్తిః — తృప్తి; హి — ఎందుకంటే; శృణ్వతః — వింటూఉంటే; న అస్తి — ఉండదు; మే — నాకు; అమృతం — అమృతము.

Translation

BG 10.18: విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము, ఓ జనార్దనా. నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివితీరదు.

Commentary

అర్జునుడు ఇక్కడ ‘...అమృతము వంటి నీ మాటలను వింటుంటే,’ అనటానికి బదులుగా ‘....నీ అమృతమును వింటుంటే,’ అన్నాడు. ‘అటువంటి నీ మాటలు’ అన్న భాగాన్ని విడిచిపెట్టాడు. ఇది సాహిత్యంలో 'అతిశయోక్తి' అనే ప్రక్రియ, దీనిలో ఉపమాన వస్తువుని విడిచిపెడతారు. శ్రీ కృష్ణుడిని జనార్దనా అని కూడా సంబోధించాడు, అంటే ‘ఆర్తులైన జనులు ఉపశమనం కోరి వెళ్ళే సహృదయుడు’ అని.

భగవంతుని మహిమల్ని వివరించే కథలు, ఆయనను ప్రేమించే వారికి అమృతము వంటివి. అమృతతుల్యమైన శ్రీ కృష్ణుడి మాటలని ఇప్పటివరకు తన చెవులతో త్రాగుతున్నాడు, ఇక ఇప్పుడు , ‘భూయః కథయ’ అంటే ‘ఇంకోసారి...! నీ దివ్యలీలలను వినాలనే నా దాహం ఇంకా తీరలేదు.’ అని అంటూ ఆయన్ను ఉత్సాహపరుస్తున్నాడు. దివ్యామృతము యొక్క స్వభావము ఇది. అది ఒకపక్క తృప్తి పరుస్తూనే ఉంటుంది అదే సమయంలో ఇంకా ఇంకా కావాలనిపింపజేస్తుంది. నైమిశారణ్య ఋషులు, సూత మహాముని నుండి శ్రీమద్భాగవతం వింటున్నప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు:

వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే
యచ్ఛృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే (1.1.19)

‘శ్రీ కృష్ణుడి భక్తులకు, ఆయన దివ్య లీలలను ఎంత విన్నా తనివితీరదు, విసుగనిపించదు. ఈ లీలామృతం ఎలాంటిదంటే అది అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది.’