Bhagavad Gita: Chapter 10, Verse 20

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ।। 20 ।।

అహం — నేను; ఆత్మా — ఆత్మ; గుడాకేశ — అర్జునా, నిద్రను జయించిన వాడా; సర్వ-భూత — సర్వ ప్రాణుల యొక్క; ఆశయ-స్థితః — హృదయములో కూర్చుని; అహం — నేను; ఆదిః — మొదలు; చ — మరియు; మధ్యం — మధ్యము; చ — మరియు; భూతానాం — సర్వ భూతముల; అంతః — తుది (అంతము); ఏవ — కూడా; చ — మరియు.

Translation

BG 10.20: ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము, మరియు అంత్యము.

Commentary

శ్రీ కృష్ణుడు, తాను జీవుడికి ఏమీ అంత దూరంగా లేను అని ప్రకటిస్తున్నాడు, నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది. వేదములు అంటున్నాయి: య ఆత్మని తిష్ఠతి , ‘భగవంతుడు మన ఆత్మలో యందు స్థితమై ఉన్నాడు.’ అందులో కూర్చుని ఆ ఆత్మకు జీవశక్తి మరియు నిత్యశాశ్వత గుణము ప్రసాదిస్తాడు. ఆయన శక్తిని ఉపసంహరిస్తే, మన ఆత్మ కూడా జడమైపోతుంది మరియు నశించిపోతుంది. ఈ ప్రకారంగా, మనం జీవాత్మలము, మన స్వీయ శక్తి చేత నిత్యులము మరియు చైతన్యవంతులము కాలేదు, పరమ చైతన్య వంతుడు మరియు సనాతనుడు అయిన భగవంతుడు మనలోనే (జీవాత్మ లోనే) ఉండి, తన శక్తిని మనకు ప్రసాదించటం చేత అలా ఉండగలుగుతున్నాము. కాబట్టి శ్రీ కృష్ణుడు సమస్త ప్రాణుల హృదయములో తాను స్థితుడనై ఉన్నాను అని అంటున్నాడు.

మన ఆత్మ భగవంతుని శరీరము, ఆయనే మన ఆత్మకి పరమాత్మ. భాగవతం ఇలా పేర్కొంటున్నది:

హరిర్హి సాక్షాద్భగవాన్ శరీరిణామాత్మా ఝషాణామివ తోయమీప్సితం (5.18.13)

‘భగవంతుడు సర్వ ప్రాణుల ఆత్మ కు ఆత్మ.’ మరల భాగవతంలో, గోపికలు తమ సొంత బిడ్డలను వదిలి పసివాడైన శ్రీ కృష్ణుడిని చూడటానికి వెళ్ళటం గురించి శుకదేవ పరమహంస చెప్పినప్పుడు, పరీక్షిత్తు, ఇది ఎలా సాధ్యమని అడిగాడు:

బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే ఇయాన్ ప్రేమా కథం భవేత్ (10.14.49)

‘ఓ బ్రాహ్మణా, అందరు తల్లులూ తమ సొంత బిడ్డలపట్లనే మమకారంతో ఉంటారు. మరి గోపికలకు, తమ సొంత బిడ్డల పైన కూడా లేకుండా, ఈ యొక్క శ్రీ కృష్ణుడి పట్ల ఇంత గాఢమైన అనురక్తి ఎలా ఏర్పడింది?’ శుకదేవ పరమహంస ఇలా బదులిచ్చాడు:

కృష్ణమేనమవేహి త్వమాత్మానమఖిలాత్మనాం (భాగవతం 10.14.55)

‘శ్రీ కృష్ణుడు విశ్వములోని సర్వ ప్రాణులకు పరమాత్మ అని దయచేసి అర్థంచేసుకోండి. మానవ జాతి మేలు కోసం, తన యోగమాయా శక్తి ద్వారా ఒక మనుష్య రూపంలో అవతరించాడు.’

శ్రీ కృష్ణుడు ఇంకా ఏమంటున్నాడంటే, తానే సమస్త జీవ భూతముల మొదలు, మధ్య, తుది (ఆది-మధ్య-అంతము) అని. అవి ఆయన నుండే ఉద్భవించాయి, కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే జీవరాశియంతా ఆయన శక్తి చేతనే సంరక్షించి కొనసాగింపబడుతున్నది, కాబట్టి ఆయనే మధ్యము. మరియు మోక్షము పొందిన వారు ఆయన యొక్క దివ్య ధామమునకు వెళ్లి, ఆయన సన్నిధిలోనే నిత్యశాశ్వతంగా నివసిస్తారు. అందుకే భగవంతుడే అన్ని ప్రాణులకు తుది. వేదములలో ఇవ్వబడిన భగవంతుని యొక్క నిర్వచనాలలో, ఒకటి ఈ క్రింద పేర్కొనబడినది:

యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, యత్ప్రయంత్యభిసంవిశంతి
(తైత్తిరీయ ఉపనిషత్తు 3.1.1)

‘ఎవని నుండి సర్వ ప్రాణులు ఉద్భవించాయో వాడే భగవంతుడు; ఎవని యందు సర్వ ప్రాణులు ఆధారపడి స్థితమై ఉన్నాయో వాడే భగవంతుడు; ఎవని లోనికి సర్వ ప్రాణులు ఏకమై పోతాయో వాడే భగవంతుడు.’