Bhagavad Gita: Chapter 11, Verse 20

ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః ।
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ।। 20 ।।

ద్యావా-పృథివ్యో — దివి నుండి భువి వరకు; ఇదం — ఈ యొక్క; అంతరం — మధ్య ప్రదేశమంతా; హి — నిజముగా; వ్యాప్తం — వ్యాపించి ఉండి; త్వయా — నీ చే; ఏకేన — ఒక్కడివే; దిశః — దిశలలో; చ — మరియు; సర్వాః — సర్వమూ; దృష్ట్వా — చూస్తూ; అద్భుతం — అద్భుతమైన; రూపమ్ — రూపము; ఉగ్రం — ఉగ్రమైన; తవ — నీ యొక్క; ఇదం — ఇది; లోక — లోకములు; త్రయం — మూడు; ప్రవ్యథితం — వణుకుచున్నవి; మహా-ఆత్మన్ — మహాత్ముడా.

Translation

BG 11.20: దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ, ముల్లోకములూ భయంతో కంపించిపోవటం నేను గమనిస్తున్నాను.

Commentary

అర్జునుడు ఇలా అంటున్నాడు, ‘ఓ సర్వాంతర్యామియైన ప్రభూ, నీవు దశ దిశలలో, భూగోళమంతా, ఆకాశమంతా, ఆ మధ్యనున్న ప్రదేశమంతా వ్యాపించి ఉన్నావు. సమస్త ప్రాణులు నీవంటే భయముతో వణికి పోతున్నాయి.’ అని. ముల్లోకములు, దానిని చూడనే లేదు మరి ఆ విశ్వ రూపము ముందు వణికి పోవటం ఎందుకు? అర్జునుడి ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతిఒక్కరు కూడా భగవంతుని చట్టానికి భయపడే పనిచేస్తారు. అందరూ ఆయన శాసనములకు లోబడి ఉండవలసినదే.

కరమ ప్రధాన బిస్వ కరి రాఖా ,

జో జస కరఇ సో తస ఫల చాఖా (రామచరితమానస్)

‘ప్రపంచమంతా కర్మ సిద్ధాంతం ప్రకారమే పని చేస్తుంది. మనము చేసే ప్రతి దానికీ కర్మ ఫలితములను అనుభవించాల్సిందే.’ ఈ కర్మ సిద్ధాంతము లాగానే, అసంఖ్యాకములైన నియమములు/చట్టములు ఉన్నాయి. ఏంతో మంది శాస్త్రవేత్తలు ప్రకృతి యొక్క భౌతిక సూత్రాలు కనుక్కుంటూ, సిద్ధాంతీకరిస్తూ తమ జీవనం గడుపుకుంటున్నారు; కానీ వారు, ప్రకృతి చట్టాలను ఏవీ సృష్టించలేరు. భగవంతుడే సర్వోన్నతమైన శాసనాలు తయారు చేసేవాడు, మరియు ప్రతి ఒక్కరూ ఆయన చట్టములకు లోబడి ప్రవర్తించవలసినదే.