నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ ।
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో ।। 24 ।।
నభః-స్పృశం — ఆకాశాన్ని తాకుతూ; దీప్తం — తేజస్సుతో వెలుగుతూ; అనేక — చాలా; వర్ణం — రంగులతో; వ్యాత్తా — తెరిచిఉన్న; ఆననం — నోర్లు; దీప్త — ప్రజ్వలిస్తూ; విశాల — విశాలమైన; నేత్రమ్ — కన్నులు; దృష్ట్వా — చూచుతున్న; హి — నిజముగా; త్వాం — నిన్ను; ప్రవ్యథితాంతర-ఆత్మా — నా హృదయము భయముతో వణికిపోవుతున్నది; ధృతిం — బలము; న విందామి — తెలవటం లేదు; శమం — మానసిక ప్రశాంతత; చ — మరియు; విష్ణో — విష్ణు మూర్తి.
Translation
BG 11.24: హే విష్ణో! ఆకాశమును తాకుతూ, ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిఉన్న నోర్లతో, విశాలమైన అగ్ని గుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు, భయముతో గుండె అదిరిపొతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను.
Commentary
విశ్వ రూపమును చూడటం అర్జునుడికి శ్రీ కృష్ణుడి పట్ల ఉన్న సంబంధము యొక్క స్వభావాన్ని మార్చివేసింది. ఇంతకు మునుపు శ్రీ కృష్ణుడిని సన్నిహిత స్నేహితునిగా చూసాడు మరియు ఆయన పట్ల ప్రియ మిత్రునిలా వ్యవహరించాడు. అతనికి శ్రీ కృష్ణుడే భగవంతుడు అన్న అవగాహన ఉండేది కానీ, అతని హృదయములో ఉన్న ఉప్పొంగే ప్రేమ, శ్రీకృష్ణుడి యొక్క పరమేశ్వర తత్త్వమును మరిచి పోయేటట్టు చేసింది. తన సఖుడు శ్రీ కృష్ణుడిని ప్రపంచంలో అన్నింటి కన్నా మిన్నగా ప్రేమించటం ఒక్కటే ఆయనకు గుర్తుంది.
ప్రేమ యొక్క స్వభావమే అలాంటిది. అది మనస్సుని ఎంత గాఢంగా నిమగ్నం చేస్తుందంటే భక్తుడు తను ప్రేమించిన భగవంతుడి యొక్క స్థాయిని మర్చిపోతాడు. ఒకవేళ ఆ అధికార స్థాయి మర్యాద ఉండిపోతే, ప్రేమ అనేది సంపూర్ణముగా వ్యక్తమవ్వదు. ఉదాహరణకి, ఒక భార్య తన భర్తని గాఢంగా ప్రేమిస్తుంది. ఆయన రాష్ట్ర గవర్నర్ అయినా, భార్య మాత్రం ఆయనను భర్తగానే చూస్తుంది, అందుకే ఆయనతో సన్నిహితంగా ఉండగలుగుతుంది. ఒకవేళ ఆమె తన మదిలో, భర్త రాష్ట్రానికి గవర్నర్ అన్న భావననే ఉంచుకుంటే, అయిన వఛ్చిన ప్రతిసారీ, లేచి నిలబడి నమస్కారం పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా, ప్రియతముని యొక్క అధికార స్థాయి అనేది ప్రేమ భావనలో మరుగున పడిపోతుంది. ఇదే పరిణామం భగవత్ భక్తిలో కూడా చోటు చేసుకుంటుంది.
వ్రజ భూమి యొక్క గోపబాలురు శ్రీ కృష్ణుడిని తమ ప్రియతమ మిత్రునిగా చూసారు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు, ఆ గోపబాలురు శ్రీ కృష్ణుడితో గడిపిన లీలలను, చాలా మధురంగా విశదీకరించారు:
దేఖో దేఖో రీ, గ్వాల-బాలన యారీ
రిఝవత ఖేల జితాయ సఖన కో, ఘోడా బని బని బనవారీ
(ప్రేమ రస మదిరా, రసియా మాధురి, 7వ పదము)
‘చూడండి, శ్రీ కృష్ణుడు మరియు ఆ గోపబాలుర మధ్య మధురమైన అన్యోన్య సహచర్యాన్ని! వారు కలిసి ఆడుకుంటున్నారు, మరియు శ్రీ కృష్ణుడు ఓడిపోయినప్పుడు, ఆయన గుర్రంలా వంగితే ఆయన స్నేహితులు ఆయనపై స్వారీ చేస్తున్నారు.’ ఒకవేళ ఆ గోపబాలురు గనక శ్రీకృష్ణుడే భగవానుడు అని గుర్తుంచుకుంటే వారు ఎప్పటికీ ఆయనతో అలా వ్యవహరించి ఉండేవారు కాదు. ప్రియ మిత్రునిగా చూసే అటువంటి భక్తుల సన్నిహిత సహచర్యాన్ని భగవంతుడు కూడా ఎంతో ఆనందంతో అనుభవిస్తాడు.
ప్రఖ్యాతమైన గోవర్ధన లీలను శ్రీకృష్ణుడు భూలోకంలో చూపించాడు; వర్షములు కురిపించే దేవత మరియు దేవరాజైన ఇంద్రుడు కురిపించే కుండపోత వానల నుండి వ్రజ భూమి వాసులను రక్షించటానికి, గోవర్ధన గిరిని ఆయన తన ఎడమ చేతి చిటికెన వ్రేలితో పైకెత్తి పట్టుకున్నాడు. కానీ, శ్రీ కృష్ణుడి సఖులైన గోపబాలురికి ఈ విషయం ఏంటో పొసగలేదు. వారి దృష్టిలో, కృష్ణుడు కేవలం ఒక ప్రియమిత్రుడే అందుకే వారు కృష్ణుడు ఒక పర్వతాన్ని ఎత్తాడు అంటే నమ్మలేదు. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ గారు ఈ పై శ్లోకాన్ని కొనసాగిస్తూ ఇలా పేర్కొన్నాడు:
నఖ ధార్యో గోవర్ధన-గిరి జబ, సఖన కహ్యో హమ గిరిధారీ
(ప్రేమ రస మదిరా, రసియా మాధురి, 7వ పదము)
‘శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు, ఆయన యొక్క మిత్రులు గోపబాలురు, వారే నిజంగా కొండను ఎత్తినట్టుగా, తమ తమ కర్రలను ఆ గిరి క్రిందిభాగంలో ఒడిసి పెట్టారు.’ చివరికి ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి, తన తెల్లని ఏనుగు ఐరావతముపై కూర్చుని వచ్చాడు. శ్రీ కృష్ణుడి సర్వోత్కృష్ట స్థానమును గుర్తించకుండా, అంతటి కుండపోత వర్షం కురిపించినందుకు క్షమాపణ చెప్పాడు.
ఇప్పుడిక, గోపబాలురు ఎప్పుడైతే స్వర్గాధిపతి అయిన ఇంద్రుడే వచ్చి తమ స్నేహితుడు కృష్ణుడికి వందనములు సమర్పించటం చూసారో, అప్పుడు శ్రీకృష్ణుడే భగవానుడు అని తెలుసుకున్నారు. ఇక, భయంతో ఆయన్ను కొంత దూరంగా ఉండే చూడటం మొదలు పెట్టారు. వారి భక్తి భావన, స్నేహం నుండి పూజ్యభావము మరియు గౌరవంగా మారటం చూసి శ్రీ కృష్ణుడు ఇలా విచారించాడు, ‘అయ్యో , మేము ఎంతో ఆనందించే ఆ యొక్క ప్రేమ పూర్వక సాన్నిహిత్యం పోయింది. వాళ్ళు ఇప్పుడు నన్ను దేవుడు అని భావిస్తున్నారు.’ అని. అందుకే తన యోగమాయా శక్తి చే, వారు తాము చూసినదాని గొప్పతనాన్ని మర్చిపోయేటట్లుగా చేసాడు, దానితో వారందరూ మరల శ్రీకృష్ణుడు కేవలం తమ స్నేహితుడే, ఇంకేమీ కాదు అనుకున్నారు.
'సఖ్య భావము' లో అర్జునుడు కూడా శ్రీ కృష్ణుడి భక్తుడే. శ్రీకృష్ణుడిని తన మిత్రునిగానే భావించేవాడు. అందుకే శ్రీకృష్ణుడిని తన రథసారథిగా ఒప్పుకున్నాడు. ఒకవేళ అతని భక్తి, శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి పరమేశ్వరుడు అన్న దృక్పథంతో ఉండి ఉంటే, అర్జునుడు అటువంటి నిమ్న స్థాయి పనిని చేపించుకునేవాడే కాదు. కానీ ఇప్పుడు, ఆయన యొక్క అనంతమైన వైభవాలను మరియు అతీంద్రియమైన ఐశ్వర్యములను చూసిన పిదప అర్జునుడికి స్నేహభావం పోయి భయము కలుగుతున్నది.