అర్జున ఉవాచ ।
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః ।। 36 ।।
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; స్థానే — ఇది సముచితము; హృషీక-ఈశ — శ్రీ కృష్ణుడా, ఇంద్రియములకు అధిపతి; తవ — నిన్ను; ప్రకీర్త్యా — కీర్తించుచూ; జగత్ — జగత్తు అంతా; ప్రహృష్యతి — ఆనందముతో ఉప్పొంగిపోవుతున్నది; అనురజ్యతే — అనురాగముతో నిండిపోయింది; చ — మరియు; రక్షాంసి — రాక్షసులు; భీతాని — భీతిల్లిపోయి; దిశః — అన్ని దిక్కులలో; ద్రవంతి — పారిపోతున్నారు; సర్వే — అందరూ; నమస్యంతి — నమస్కరిస్తున్నారు; చ — మరియు; సిద్ధ-సంఘాః — సిద్ధగణముల వారు అందరూ.
Translation
BG 11.36: అర్జునుడు పలికెను : హే హృషీకేశా (ఇంద్రియములకు అధిపతి), సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనందహర్షములతో ఉన్నది, మరియు నీ పట్ల ప్రేమతో నిండిపొయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు.
Commentary
ఈ శ్లోకంలో, ఇంకా తదుపరి పది శ్లోకాలలో, అర్జునుడు శ్రీ కృష్ణుడి యశోవైభవమును ఎన్నో రకాలుగా కీర్తిస్తున్నాడు. 'స్థానే' అన్న పదం వాడాడు అంటే, 'ఇది సముచితమే' అని అర్థం. ఒక మహారాజు గారి సార్వభౌమాధికారాన్ని అంగీకరించిన ఆ రాజ్య ప్రజలు, ఆ రాజు గారిని కీర్తించటంలో సంతోషాన్ని అనుభవించటం సహజమే. ఆ రాజు గారిపట్ల శతృత్వం ఉన్న వారు భయంతో ఆయన వద్ద నుండి పారిపోవటం కూడా సహజమే. ఆ మహారాజు గారి ఆప్తులైన మంత్రివర్గము ఆయన పట్ల అత్యంత భక్తిభావనతో ఉండటం కూడా సహజమే. ఇదే విషయం ఉపమానంగా అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు - జగమంతా ఆ భగవంతుడిని కీర్తిస్తుంది, రాక్షసులు ఆయన అంటే భయపడుతారు, మరియు సిద్ధసాధువులు ఆయనకు భక్తియుక్త ఆరాధన సమర్పిస్తారు.