నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ ।
అనంతవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ।। 40 ।।
నమః — నమస్కారములు; పురస్తాత్ — ముందునుండి; అథ — మరియు; పృష్ఠతః — వెనుక నుండి; తే — నీకు; నమః అస్తు — నమస్కారములు సమర్పిస్తున్నాను; తే — నీకు; సర్వతః — అన్ని వైపులనుండి; ఏవ — నిజముగా; సర్వ — అన్నీ; అనంత-వీర్య — అనంతమైన శక్తి; అమిత-విక్రమః — అపరిమితమైన పరాక్రమము, శక్తి; త్వం — నీవు; సర్వం — అన్నింటినీ; సమాప్నోషి — వ్యాపించి; తతః — ఈ విధంగా; అసి — (నీవు) ఉన్నావు; సర్వః — అన్నింటిలో.
Translation
BG 11.40: అనంతమైన శక్తిసామర్థ్యములు కల ప్రభూ, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను, నిజానికి అన్ని వైపులనుండీ నమస్కరిస్తున్నాను! నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగినవాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు, అందుకే సమస్తమూ నీ స్వరూపమే.
Commentary
శ్రీ కృష్ణుడిని ‘అనంత-వీర్య’ (అనంతమైన సామర్థ్యములు కలవాడు) మరియు ‘అనంత-విక్రమః’ (అపరిమితమైన పరాక్రమము కలవాడు) అని ప్రకటిస్తూ అర్జునుడు కృష్ణుడిని కీర్తించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. విభ్రాంతిచే ఉప్పొంగిపోయి, శ్రీ కృష్ణుడికి పదే పదే, నమః! నమః! అంటూ అన్ని వైపుల నుండి వందనములు సమర్పిస్తున్నాడు.