సంజయ ఉవాచ ।
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః ।
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ।। 50 ।।
సంజయ ఉవాచ — సంజయుడు ఇలా పలికెను; ఇతి — ఈ విధముగా; అర్జునం — అర్జునునికి; వాసుదేవః — కృష్ణుడు, వసుదేవుని తనయుడు; తథా — ఆ విధముగా; ఉక్త్వా — పలికిన పిదప; స్వకం — తన వ్యక్తిగత; రూపం — రూపమును; దర్శయామ్-ఆస — చూపించెను (దర్శింపచేసెను); భూయః — మరల; ఆశ్వాసయామ్-ఆస — ఊరడించాడు; చ — మరియు; భీతం — భీతిల్లిన; ఏనం — అతనికి; భూత్వా — అగుతూ; పునః — మరల; సౌమ్య-వపు: — సౌమ్యమైన రెండు చేతుల రూపము; మహా-ఆత్మా — దయాళువు.
Translation
BG 11.50: సంజయుడు ఇలా పలికెను: ఈ విధముగా పలికిన పిదప దయాళువైన వసుదేవుని తనయుడు తన యొక్క (చతుర్భుజ) సాకార రూపమును మరల చూపించెను. తదుపరి, సౌమ్యమైన (రెండు భుజముల) రూపమును స్వీకరించి, భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను.
Commentary
శ్రీ కృష్ణుడు తన యొక్క విశ్వరూపమును దాచిపెట్టి (ఉపసంహరించి), బంగారు కిరీటముతో, చక్రము, గద, మరియు తామర పువ్వుతో అలంకరించబడి ఉన్న చతుర్భుజ రూపములో అర్జునుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అది రాజసము, సర్వజ్ఞత, సర్వశక్తిత్వము వంటి సమస్త దివ్య ఐశ్వర్యములకు నెలవు. శ్రీ కృష్ణుడి యొక్క చతుర్భుజ రూపము విస్మయము మరియు గౌరవము వంటి భావాలను కలుగచేస్తుంది; ఇది ప్రజలకు ఆ దేశ మహారాజు పట్ల ఉండే భావన వంటిది. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుడి సఖుడు (మిత్రుడు), అందుకే పూజ్య భావము మరియు గౌరవము ప్రధానంగా ఉన్న భక్తి ఆయనను తృప్తి పరచలేదు. ఆయన శ్రీకృష్ణుడితో ఆడుకున్నాడు, కలిసి తిన్నాడు, తన యొక్క ఆంతరంగిక రహస్యాలను చెప్పుకున్నాడు, మరియు ప్రేమతోడి మధుర క్షణాలను ఆయనతో పంచుకున్నాడు. ఇటువంటి పరమానందదాయకమైన సఖ్య భావము (భగవంతుడిని సఖుడిగా భావించే భక్తి) ఐశ్వర్య భక్తి (భగవంతుడిని కాస్త దూరముగా ఈశ్వరునిగా భావించే భక్తి) కంటే అనంతమైన రెట్లు మధురమైనది. కాబట్టి, అర్జునుడి భక్తి భావమునకు సరిపోయేటట్లు, శ్రీకృష్ణుడు అంతిమంగా తన చతుర్భుజ స్వరూపమును కూడా దాచిపెట్టి, తన అసలైన రెండు భుజముల స్వరూపములోకి మారిపోయాడు.
ఒకసారి బృందావన అడవిలో, శ్రీకృష్ణుడు గోపికలతో ప్రేమతోడి లీలలు చేస్తూ, అకస్మాత్తుగా వారిమధ్య నుండి మాయమై పోయాడు. గోపికలు ఆయనను తిరిగి కనిపించమని వేడుకున్నారు. వారి విన్నపమును మన్నించిన శ్రీకృష్ణుడు మరల తన చతుర్భుజ రూపములో దర్శనమిచ్చాడు. గోపికలు ఆయనను విష్ణు మూర్తి అనుకోని తమ వందనములు సమర్పించారు. కానీ వారు ఆయన యందు ఆకర్షితం కాక ఆయనతో సమయం గడపలేక అక్కడ నుండి ముందుకెళ్ళిపోయారు. వారు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడిని తమ ఆత్మసఖునిగా చూడటానికి అలవాటు పడిపోయారు, మరియు వారిని, ఆయన యొక్క విష్ణుమూర్తి స్వరూపము ఆకట్టుకోలేదు. అదే సమయంలో అక్కడికి రాధారాణి వచ్చింది, మరియు ఆమెను చూసిన పిదప, శ్రీకృష్ణుడు ప్రేమతో ఉప్పొంగిపోయి, తన యొక్క చతుర్భుజ రూపమును ఉంచుకోలేకపోయాడు. ఆయన యొక్క రెండు చేతులు వాటికవే మాయం అయిపోయాయి మరియు తన రెండు చేతుల రూపమును తిరిగి స్వీకరించాడు. ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు తన యొక్క అత్యంత ఆకర్షణీయమైన ద్విభుజ రూపమునకు తిరిగివచ్చేసాడు.