ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ ।
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ।। 7 ।।
ఇహ — ఇక్కడ; ఏక-స్థం — ఒకే చోట కూడియున్న; జగత్ — జగత్తు; కృత్స్నం — సమస్తము; పశ్య — దర్శించుము; అద్య — ఇప్పుడు; స చర అచరమ్ — చరాచరములతో కూడి ఉన్న; మమ — నా యొక్క; దేహే — ఈ రూపము యందు; గుడాకేశ — అర్జునా, నిద్రను జయించిన వాడా; యత్ — ఏదైతే; చ — మరియు; అన్యత్ — వేరే ఇతర; ద్రష్టుమ్ — చూడాలి అని; ఇచ్ఛసి — కోరుకున్నావో.
Translation
BG 11.7: ఒక్కచోటే కూడిఉన్న సమస్త చరాచరములను కలిగిఉన్న జగత్తును, నా విశ్వ రూపము యందే దర్శించుము ఇప్పుడు ఓ అర్జునా. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వ రూపము యందే తిలకించుము.
Commentary
తన స్వరూపమును తిలకించమని చెప్పిన కృష్ణుని ఆదేశం విన్నతరువాత, అర్జునుడికి ఎక్కడ ఇవన్నీ చూడాలి అన్న సందేహం కలిగింది. పరమేశ్వరుని దివ్య మంగళ స్వరూప శరీరము యందే వాటిని దర్శించమని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. అనంతమైన బ్రహ్మాండములను, వాటివాటి సమస్త చరాచర ప్రాణుల/పదార్థములతో సహా, వాటిని అక్కడే అర్జునుడు చూస్తాడు. సర్వమూ ఆ విశ్వ రూపములో ఉంటుంది, భూత/భవిష్యత్ సంఘటనలు కూడా ఉంటాయి. అర్జునుడు తద్వారా, విశ్వ పరిణామ ఆవిష్కరణ ప్రణాళికలో భాగంగా, పాండవుల విజయాన్ని మరియు కౌరవుల పరాజయాన్ని చూడగలుగుతాడు.