న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా ।
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ।। 8 ।।
న — కాదు; తు — కానీ; మాం — నన్ను; శక్యసే — నీవు చేయగలవు; ద్రష్టుమ్ — చూచుట; అనేన — వీటితో; ఏవ — అయినా; స్వ-చక్షుషా — నీ ప్రాకృతిక కళ్ళతో; దివ్యం — దివ్యమైన; దదామి — నేను ప్రసాదించెదను; తే — నీకు; చక్షుః — కనులు; పశ్య — చూడుము; మే — నా యొక్క; యోగం-ఐశ్వరమ్ — యోగ ఐశ్వర్యమును.
Translation
BG 11.8: కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము.
Commentary
పరమేశ్వరుడైన భగవానుడు ఈ లోకంలోకి అవతరించినప్పుడు, ఆయనకి రెండు రకాల స్వరూపాలు ఉంటాయి — ఒకటి ప్రాకృతిక కళ్ళతో చూడగలిగే భౌతికమైన స్వరూపము, మరొకటి దివ్య దృష్టితో మాత్రమే చూడగలిగే దివ్య స్వరూపము. ఈ విధంగా, మనుష్యులు ఆయనను భూలోక అవతార సమయంలో తప్పకుండా దర్శిస్తారు కానీ ఆయన యొక్క ప్రాకృతిక రూపంలోనే చూస్తారు. ఆయన యొక్క దివ్య స్వరూపము వారియొక్క ప్రాకృతిక కన్నులకు కనపడదు. ఈ కారణం వల్లనే ఈ భౌతిక ప్రపంచపు జీవాత్మలు, భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడు, ఆయనను గుర్తించలేరు. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని 9వ అధ్యాయం, 11వ శ్లోకంలో చెప్పిఉన్నాడు: ‘నేను నా సాకార రూపంలో అవతరించినప్పుడు అజ్ఞానులు నన్ను గుర్తించలేరు. వారికి సర్వ భూతములకు ఈశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము తెలియదు.’ జనులు చూసేది కేవలం దివ్య అవతారము యొక్క భౌతిక స్వరూపము మాత్రమే.
ఇదే సూత్రము ఆయన యొక్క విశ్వ రూపమునకు వర్తిస్తుంది. ఇంతకు క్రితం రెండు శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు అర్జునుడిని తన యొక్క విశ్వ రూపమును చూడమని అడిగాడు, కానీ అర్జునుడికి ఏమీ కనపడలేదు ఎందుకంటే అతనికి ప్రాకృతిక కన్నులే ఉన్నాయి. ఈ యొక్క ప్రాకృతిక కళ్ళు ఆ విశ్వ రూపమును దర్శించటానికి సరిపోవు మరియు సామాన్యమైన బుద్ధికి అది అర్థం కాదు. అందుకే, అర్జునుడు అపూర్వ వైభవముతో ఉన్న విశ్వ రూపమును దర్శించటానికి సాధ్యమయ్యేటట్టుగా, శ్రీ కృష్ణుడు, ఆయనకి దివ్య దృష్టిని ఇప్పుడు ప్రసాదిస్తాను అని అంటున్నాడు.
ఆధ్యాత్మిక దృష్టి ప్రసాదించటం అనేది ఒక భగవంతుని కృప. ఆయన కృప చేతనే, భగవంతుడు తన దివ్య చక్షువులను జీవాత్మ యొక్క ప్రాకృతిక కనులకు అందిస్తాడు; తన దివ్య మనస్సుని జీవాత్మ యొక్క ప్రాకృతిక మనస్సుకు అందిస్తాడు; తన దివ్య బుద్ధిని జీవాత్మ యొక్క ప్రాకృతిక బుద్ధికి అందిస్తాడు. తదుపరి, ఈ భగవంతుని దివ్యమైన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి కలిగిఉన్న జీవాత్మ ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలుగుతుంది, స్మరించగలుగుతుంది మరియు దాన్నిఅర్థం చేసుకోగలుగుతుంది.