Bhagavad Gita: Chapter 12, Verse 10

అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ ।
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి ।। 10 ।।

అభ్యాసే — అభ్యాసములో; అపి — ఒకవేళ; అసమర్థః — అసమర్థత (అశక్యత); అసి — నీవు; మత్-కర్మ-పరమః — భక్తితో నాకోసమే పని చేయుము; భవ — ఉండుము; మత్-అర్థం — నా కోసమే; అపి — కూడా; కర్మాణి — కర్మలు; కుర్వన్ — ఆచరింపుము; సిద్ధిం — సిద్ధి (పరిపూర్ణత); అవాప్స్యసి — నీవు పొందగలవు.

Translation

BG 12.10: నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు.

Commentary

భగవంతుణ్ణి స్మరించటాన్ని అభ్యాసం చేయండి, అని చెప్పటం తేలిక కానీ అనుసరించటం కష్టం. మనస్సు అనేది భౌతిక శక్తి మాయతో తయారైనది మరియు అది సహజంగానే భౌతిక ప్రాపంచిక వస్తువిషయముల వైపు పరుగు పెడుతుంది, అదే సమయంలో దాన్ని భగవంతుని వైపు తీస్కువెళ్ళటానికి ప్రయత్నపూర్వకమైన దృఢ పరిశ్రమ అవసరం. భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి అన్న ఉపదేశం మనము వినే ఉంటాము, మనకు దానిని ఆచరించాలనే ఉంటుంది కానీ, మనం మన పనిలో నిమగ్నమై పోయినప్పుడు, మనస్సు భగవంతుడిని మర్చిపోతుంది. కాబట్టి, భగవంతుడిని రోజంతా స్మరిస్తూ ఉండటం అనేది కష్టతరముగా ఉన్నవారు మరి ఏంచేయాలి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శ్రీ కృష్ణుడు పై శ్లోకంలో ఇస్తున్నాడు.

భగవంతుణ్ణి నిరంతరం స్మరించలేని వారు ఆయన కోసం పని చేయటం అనేదాన్ని అభ్యాసం చేయాలి. వారు చేసే పని ఏదయినా, తాము చేసేది భగవత్ ప్రీతి కోసమే అన్న భావన, 9.27వ మరియు 9.28వ శ్లోకాలలో చెప్పినట్టుగా, అలవాటు చేసుకోవాలి. గృహస్తు జీవితంలో ఉన్నప్పుడు, చాల మటుకు సమయం కుటుంబ పోషణ మరియు నిర్వహణ కోసమే గడిచిపోతుంది. ఆయా పనులు చేస్తూనే ఉండాలి కానీ అంతర్గత భావన మార్చుకోవాలి. వారి మీద ఉన్న శారీరక మమకారానురాగం కోసం కాకుండా, కుటుంబ సభ్యులందరూ భగవంతుని బిడ్డలే అని, భగవంతుని ప్రీతి కోసమే వారందరి బాగోగులు చూసుకునే బాధ్యత ఉందని భావించాలి. తన జీవనోపాధి ఆర్జించటం చేస్తూనే ఉండాలి, కానీ, ఆ పని చేస్తున్న అంతర్గత భావన మార్చుకోవాలి. ప్రాపంచిక భోగాల కోసం డబ్బులు సంపాదిస్తున్నాము అనుకోకుండా, ఇలా అనుకోవచ్చు ‘నన్ను, నా కుటుంబ సభ్యులను పోషించుకోవటానికి, తద్వారా మేమంతా భక్తిలో నిమగ్నమవ్వటానికి ఇది అవసరం. మరియు ఏదైనా మిగుల్చుకుంటే, నేను భగవత్ సేవకి దానిని దానము చేస్తాను.’ అని. అదేవిధముగా, శారీరక క్రియలైన తినటం, నిద్రపోవటం, స్నానం చేయటం వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇక్కడ కూడా భగవత్ దృక్పథం అలవాటు చేసుకోవాలి. ‘నేను నా శరీరమును ఆరోగ్యముగా ఉంచుకోవాలి, ఎందుకంటే దానితో నేను భగవత్ సేవ చేసుకోవాలి. అందుకే, దాని నిర్వహణ కోసం అవసరమయ్యే పనులను జాగ్రత్తగా చేసుకుంటాను.’ అని భావించాలి.

మనం భగత్ ప్రీతి కోసం పనిచేయటం అభ్యాసం చేస్తున్నప్పుడు, సహజంగానే మనము స్వార్థ పూరిత పనులను చేయటం ఆపివేస్తాము మరియు భగవత్ సేవా దృక్పథంలో ఉన్న పనులను చేయటం మొదలుపెడుతాము. ఈ విధంగా, సమస్త కార్యములను (పనులను) శ్రీ కృష్ణ పరమాత్మ ప్రీతి కోసమే చేస్తుంటే, మన మనస్సు నిశ్చలముగా ఉంటుంది మరియు త్వరగానే ఆయన మీదనే ధ్యాస ఉంచగలుగుతాము. ఆ తర్వాత క్రమేపీ, భగవంతుని పై ప్రేమ మన హృదయములో ప్రకటితమౌతుంది, మరియు ఆయన గురించే నిరంతరం స్మరించటంలో పురోగతి సాధిస్తాము.