యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః ।
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియ: ।। 15 ।।
యస్మాత్ — ఎవరిచే కూడా; న ఉద్విజతే — ఉద్వేగమునకు గురి కాకుండా; లోకః — జనులు; లోకాత్ — జనుల చేత; న ఉద్విజతే — ఉద్రేకపడకుండా; చ — మరియు; యః — ఎవరైతే; హర్ష — సంతోషము; అమర్ష — బాధ; భయ — భయము; ఉద్వేగః — ఆందోళన; ముక్తః — లేకుండా; యః — ఎవరైతే; సః — వారు; చ — మరియు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైనవారు.
Translation
BG 12.15: లోకమున ఎవ్వరినీ బాధ(క్షోభ) పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
Commentary
ఆత్మ అనేది సహజంగా స్వచ్ఛమైనది మరియు నిర్మలమైనది. సమస్య ఏమిటంటే ఇప్పుడు అది మలినమైన మనస్సుచే కప్పబడి ఉంది. ఒకసారి ఈ మలినములు నిర్మూలించబడిన తరువాత ఆత్మ సహజంగానే ప్రకాశిస్తుంది. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొన్నది:
యస్యాస్తి భక్తిర్భగవత్యకించనా
సర్వైర్గుణైఃస్ తత్ర సమాసతే సురాః
హరావభక్తస్య కుతో మహద్గుణాః
మనోరథేనాసతి ధావతో బహిః (5.18.12)
‘పరమేశ్వరుని పట్ల భక్తితో అంకిత భావముతో ఉన్న వారిలో దేవతల యొక్క అద్భుతమైన గుణములన్నీ వ్యక్తమవుతాయి. కానీ ఎవరైతే భక్తిలో నిమగ్నం కాకుండా ఉంటారో, వారు తమ మనస్సు అనే రథంపై పరిగెడుతూనే ఉంటారు (వారిని వారు ఉద్ధరించుకోవాలనే ఎన్ని ప్రయత్నాలు చేసినా).’ ఇక్కడ, తన భక్తులలో ప్రకటితమయ్యే ఇంకా కొన్ని గుణములను వివరిస్తున్నాడు.
ఎవ్వరికీ ఇబ్బంది కలిగించేట్టుగా ఉండరు: భక్తి అనేది హృదయమును కరిగించి, సున్నితముగా చేస్తుంది. కాబట్టి భక్తులు సహజంగానే ఇతరుల పట్ల వ్యవహారంలో మృదువుగా వ్యవహరిస్తారు. అంతేకాక, ప్రతి ఒక్కరిలో భగవంతుడు కూర్చుని ఉన్నట్టుగా మరియు వారందరిని ఆయన యొక్క అణు-అంశములుగా దర్శిస్తారు. కాబట్టి, ఎవ్వరికీ కూడా హాని తలపెట్టడాన్ని తలచలేరు.
ఎవ్వరి వలన ఉద్వేగమునకు గురి కారు: భక్తులు ఎవ్వరికి హాని తలపెట్టకపోయినా, ఇతరులు వారికి హాని తలపెట్టరని కాదు. ప్రపంచం మొత్తం మీద మహాత్ముల చరిత్ర చూస్తే, వారి జీవితకాలంలో వారు చేసిన సంక్షేమ కార్యములు మరియు ఉపదేశముల వల్ల భయపడ్డవాళ్లు తరచుగా వారిని వేధించారు. కానీ, మహాత్ములు ఎప్పుడూ తమకు హాని తలపెట్టిన వారి పట్ల కూడా కారుణ్య భావన తోనే ఉన్నారు. అందుకే, నజరేయుడైన యేసు (Jesus of Nazareth) శిలువపై ఇలా ప్రార్థించాడు, ‘తండ్రీ, వారిని క్షమింపుము ఎందుకంటే వారేమి చేస్తున్నారో వారికి తెలియదు’ (Father, forgive them for they know not what they do. (Luke 23.34))
సంతోషము మరియు బాధలలో సమానముగా ఉండుట: భక్తులు శాస్త్ర పరిజ్ఞానము యొక్క ఎరుకతో ఉంటారు. కాబట్టి, జీవన క్రమంలో, వచ్చిపోయే ఎండాకాలం, శీతాకాలం లాగా కష్టాలు, సుఖాలు రెంటినీ తప్పించుకోలేము అన్న వివేకముతో ఉంటారు. ఈ విధంగా, తరిగిపోని సకారాత్మక దృక్పథంతో, వారు రెండింటిలో కూడా భగవత్ అనుగ్రహమునే చూస్తారు మరియు అన్ని పరిస్థితులను తమ భక్తిని పెంపొందించుకోవటానికే వాడుకుంటారు.
భయాందోళనల రహితముగా ఉండుట: భయము మరియు ఆందోళనల యొక్క మూల కారణము మమకారాసక్తియే. మనకు మమకారాసక్తి ఉన్న వస్తువు కోసం తపిస్తాము మరియు అది దూరమై పోతుందేమో అని భయానికి లోనవుతాము. మనము ప్రాపంచిక వస్తువులు-వ్యక్తుల పట్ల అనాసక్తత పెంచుకుంటే మనము భయరహితముగా అవుతాము. భక్తులు ఆసక్తి రహితముగా ఉండటమే కాక భగవంతుని సంకల్పంతో ఏకీభావముతో ఉంటారు. కాబట్టి, వారు భయము లేదా ఆందోళనకు గురి కారు.