యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే ।
శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేఽతీవ మే ప్రియాః ।। 20 ।।
యే — ఎవరైతే; తు — నిజముగా; ధర్మ — జ్ఞానమనే; అమృతం — అమృతము; ఇదం — ఇది; యథా — ఇలా; ఉక్తం — చెప్పబడిన; పర్యుపాసతే — అనన్య భక్తితో సేవిస్తారో; శ్రద్ధధానాః — విశ్వాసముతో; మత్-పరమాః — నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ; భక్తాః — భక్తులు; తే — వారు; అతీవ — అత్యంత; మే — నాకు; ప్రియాః — ప్రియమైన వారు.
Translation
BG 12.20: ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి, నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు.
Commentary
అర్జునుడి ప్రశ్నకు తన సమాధానమును సారాంశంగా చెప్తూ శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయమును ముగిస్తున్నాడు. ఈ అధ్యాయ ప్రారంభంలో అర్జునుడు కృష్ణుడిని, ఎవరు ఉన్నతమైన వారు అని అడిగాడు — తన సాకార రూపమును భక్తి యోగము ద్వారా పూజించేవారా లేక నిరాకార బ్రహ్మన్‌ను జ్ఞాన యోగము ద్వారా ఆరాధించేవారా అని. శ్రీ కృష్ణుడు రెండవ శ్లోకంలో దానికి సమాధానం చెప్తూ, తన సాకార రూపము పట్ల నిశ్చలమైన భక్తితో ఉండేవారినే అత్యున్నత యోగులని చెప్పి ఉన్నాడు. తదుపరి, భక్తి విషయం మీద మరింత చెపుతూ, భక్తి చేసే విధానాన్ని చెప్పిన తరువాత భక్తుల యొక్క లక్షణములను వివరించాడు. ఇక ఇప్పుడు మరొక సారి, అత్యున్నత ఆధ్యాత్మిక మార్గము భక్తియే అని వక్కాణిస్తున్నాడు. ఎవరైతే పరమేశ్వరుడినే తమ లక్ష్యముగా చేసుకుని, దృఢ విశ్వాసముతో భక్తిని పెంపొందించుకుని, ఇంతకు క్రితం శ్లోకాలలో చెప్పబడిన సద్గుణములను కలిగిఉంటారో, అటువంటి భక్తులు భగవంతునికి అత్యంత ప్రియమైనవారు.