కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ।। 21 ।।
కార్య — కార్యము; కారణ — కారణము; కర్తృత్వే — ఉత్పన్నము చేయుటలో; హేతుః — హేతువు; ప్రకృతిః — భౌతిక శక్తి; ఉచ్యతే — చెప్పబడును; పురుషః — జీవాత్మ; సుఖ-దుఃఖానాం — సుఖ దుఃఖముల యొక్క; భోక్తృత్వే — అనుభవించుటలో; హేతుః — హేతువు; ఉచ్యతే — అంటారు.
Translation
BG 13.21: సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది.
Commentary
బ్రహ్మ దేవుని నిర్దేశం అనుసరించి, భౌతిక శక్తి, ఈ సృష్టిలో ఎన్నెన్నో విభిన్నమైన జీవన మూలపదార్థములను మరియు జీవ రాశులను సృష్టిస్తుంది. బ్రహ్మ దేవుడు బృహత్ పథకాన్ని రచిస్తాడు, దానిని భౌతిక శక్తి అమలుపరుస్తుంది. భౌతిక జగత్తులో 84 లక్షల జీవరాశులు ఉన్నట్టు వేదములు పేర్కొంటున్నాయి. ఈ శారీరక స్వరూపాలు అన్నీ కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరాలే. కాబట్టి ప్రకృతియే జగత్తులోని కారణము మరియు కార్యములకు మూలహేతువు.
ఆత్మకు ఈ శరీర రూపము (క్షేత్రము) దాని యొక్క పూర్వ జన్మల కర్మ ఫలముగా లభిస్తుంది, మరియు అది తనను తానే ఈ శరీరము, మనస్సు, మరియు బుద్ధి అనుకుంటుంది. అందుకే అది శారీరక సుఖముల కోసం ప్రయత్నిస్తుంది. ఇంద్రియములు, ఇంద్రియవస్తు విషయములతో సంపర్కము చెందినప్పుడు, మనస్సు ఒక ఆనందకర అనుభూతిని పొందుతుంది. ఆత్మ, మనస్సుతో అనుసంధానం అయి ఉన్నకారణంగా, ఆత్మ పరోక్షంగా ఈ సుఖాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా, ఆత్మ అనేది, ఇంద్రియమనోబుద్ధుల ద్వారా సుఖదుఃఖములను అనుభవిస్తుంది. దీనిని ఒక కలతో పోల్చవచ్చు.
ఏహి బిధి జగ హరి ఆశ్రిత రహఈ. జదపి అసత్య దేత దుఃఖ అహఈ
(రామచరితమానస్)
జౌం సపనేం సిర కాటఇ కోఈ. బిను జాగేఁ న దూరి దుఖ హోఈ
(రామచరితమానస్)
‘ఈ జగత్తు భగవంతునిచే నిర్వహించి పోషించబడుతున్నది. అది ఒక భ్రాంతిని కలుగచేస్తుంది, అది, అసత్యమైనా, ఆత్మని యాతనకి గురి చేస్తుంది. ఇది ఎలాగంటే, స్వప్నంలో వ్యక్తి తల తెగిపోతే, ఆ యాతన, ఆ వ్యక్తి నిద్రలేచి, కలలు కనటం ఆపేంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది.’ శరీరముతోనే అనుసంధానం చేసుకున్న ఈ యొక్క ప్రస్తుత స్వప్న స్థితిలో కూడా, ఆత్మ తన యొక్క పూర్వ మరియు ప్రస్తుత కర్మల పరంగా సుఖదుఃఖములను అనుభవిస్తూనే ఉంటుంది. ఫలితంగా, రెండు రకాల అనుభూతులకు కూడా అదే కారణము అని చెప్పబడుతుంది.