ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ।। 25 ।।
ధ్యానేన — ధ్యానము ద్వారా; ఆత్మని — హృదయములో; పశ్యంతి — దర్శించెదరు; కేచిత్ — కొందరు; ఆత్మానం — పరమాత్మ; ఆత్మనా — మనస్సుచే; అన్యే — ఇతరులు; సాంఖ్యేన — జ్ఞాన సముపార్జన ద్వారా; యోగేన — యోగ పద్ధతి; కర్మ-యోగేన — కర్మ ఆచరణ ద్వారా భగవంతునితో ఏకమవ్వటం; చ — మరియు; అపరే — మరికొందరు.
Translation
BG 13.25: కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు; మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు.
Commentary
వైవిధ్యము అనేది భగవంతుని సృష్టి అంతటా ఉన్న లక్షణము. ఒకే చెట్టుకు ఉన్న ఏ ఒక్క రెండు ఆకులు కూడా ఒక్క లాగే ఉండవు; ఏ ఇద్దరి వ్యక్తుల వ్రేలి ముద్రలు కూడా ఒక్కలా ఉండవు; ఏ రెండు మానవ సమాజాలు కూడా ఒకే విధంగా ఉండవు. అదే విధంగా, అన్ని ఆత్మలు విభిన్నమైనవే మరియు వాటి వాటి ప్రత్యేక జనన-మరణ చక్ర ప్రయాణంలో ఆపాదించుకున్న విలక్షణమైన స్వభావాలు వాటికి ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో కూడా అందరూ ఒకే రకమైన అభ్యాసమునకు ఇష్ట పడరు. భగవద్గీత మరియు వైదిక శాస్త్రముల అద్భుతమైన గొప్పతనం ఏమిటంటే అవి మనుష్యులలో ఉన్న ఈ అంతర్లీన వైవిధ్యాన్ని అర్థంచేసుకుని మరియు తమ ఉపదేశాలలో వారందరికీ తగిన సూచనలను అందిస్తాయి.
ఇక్కడ, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, కొందరు సాధకులు తమ మనస్సుతో పోరాడి దానిని నియంత్రణ లోనికి తేవటంలో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తారు. వారు తమలోనే స్థితమై ఉన్న భగవంతుడి పై ధ్యానం చేయటానికి ఆకర్షితమౌతారు. వారి మనస్సు వారిలోనే ఉన్న భగవంతుని పై ఆశ్రయం పొంది నిలకడగా ఉన్నప్పుడు, వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు.
మరికొందరు తమ బుద్ధితో కసరత్తు చేయటంలో తృప్తి పొందుతారు. ఆత్మ మరియు శరీరము-మనస్సు-బుద్ధి-అహంకారము వేరనే విషయము, వారిని చాలా ఉత్తేజపరుస్తుంది. ఆత్మ-భగవంతుడు-మాయ అనే ఈ మూడు అస్తిత్వాల గురించి, శ్రవణము, మననము, నిధిధ్యాసన (వినటం, చింతన చేయటము, దృఢ విశ్వాసంతో నమ్మటం) ప్రక్రియల ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకోవటం వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది.
ఇంకా కొందరు అర్థవంతమైన కార్యములు చేయటంలో అత్యంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. భగవంతుడు వారికి ఇచ్చిన శక్తిసామర్థ్యములను ఆయన కొరకు పనిచేయటంలోనే ఉపయోగిస్తారు. తమ శక్తిలో చిట్ట చివరి భాగాన్ని కూడా భగవత్ సేవకే వినియోగించినప్పుడు పొందిన తృప్తి మరింక దేనిలోనూ పొందరు. ఈ ప్రకారంగా, అన్ని రకాల సాధకులు తమతమ వ్యక్తిగత సహజస్వభావాలను ఆ పరమ పురుషుడిని ఆచరణలో తెలుసుకోవటానికి వాడతారు. జ్ఞానము, కర్మ, ప్రేమ లతో కూడి ఉన్న ఏ ప్రయాస అయినా పరిపూర్ణత సాధించాలంటే దానితో భగవత్ ప్రీతికై ఉన్న భక్తిని జత చేయాలి. శ్రీమద్ భాగవతము ప్రకారం:
సా విద్యా తన్-మతిర్ యయా (4.29.49)
‘భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవటానికి సహకరించే జ్ఞానమే నిజమైన జ్ఞానము. భగవత్ ప్రీతి కోసము చేసినప్పుడే కర్మ యొక్క పరిపూర్ణత సిద్ధిస్తుంది.’