Bhagavad Gita: Chapter 13, Verse 5

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ ।
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ।। 5 ।।

ఋషిభిః — మహర్షుల చే; బహుధా — చాలా రకాలుగా; గీతం — పాడబడినది; ఛందోభిః — వేద మంత్రములలో; వివిధైః — వివిధములైన; పృథక్ — వేర్వేరుగా; బ్రహ్మ-సూత్ర — బ్రహ్మ సూత్రములు; పదైః — శ్లోకములు; చ — మరియు; ఏవ — ప్రత్యేకముగా; హేతు-మద్భిః — తర్కముతో (సహేతుకంగా); వినిశ్చితైః — నిశ్చయాత్మకముగా.

Translation

BG 13.5: మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.

Commentary

స్పష్టముగా, సూటిగా మరియు తర్కబద్దముగా చెప్పినప్పుడు జ్ఞానము అనేది మన మనస్సుకు హత్తుకునేలా ఉంటుంది. అంతేకాక, అది దోషరహితముగా స్వీకరించబడాలి అంటే అది దోషరహితమైన ప్రమాణముచే నిర్దారించబడాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ద్రువీకరించటానికి వేదములే ఆధారము.

వేదములు: ఇవి ఏవో పుస్తకముల పేర్లు కావు; ఇవి సనాతనమైన భగవంతుని యొక్క జ్ఞానము. భగవంతుడు జగత్తుని సృష్టించినప్పుడల్లా, ఆయన వేదములను జీవుల (ఆత్మల) సంక్షేమం కోసం ప్రకటిస్తాడు. బృహదారణ్యక ఉపనిషత్తు (4.5.11) ఇలా పేర్కొంటున్నది: నిఃశ్వసితమస్య వేదాః, ‘వేదములు భగవంతుని శ్వాస నుండి ప్రకటితమయినాయి.’ అవి ప్రారంభంలో ప్రప్రథమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో తెలియపరచబడినాయి. అక్కడ నుండి, వాక్ సాంప్రదాయం పరంగా ముందుతరాలకు అందించబడినాయి, అందుకే వాటికున్న ఇంకొక పేరు శృతి, ‘చెవి ద్వారా అందుకోబడిన జ్ఞానము’. కలియుగ ప్రారంభంలో, స్వయంగా భగవత్ అవతారమైన వేద వ్యాసుడు, వేదములను పుస్తక రూపంలో పొందుపరిచాడు, మరియు ఒక్కటిగా ఉన్న జ్ఞాన భాండాగారమును నాలుగు విభాగాలుగా విభజించాడు - ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, మరియు అథర్వ వేదము. అందుకే, ఆయనకు వేద వ్యాసుడు అన్న పేరు వచ్చింది, అంటే ‘వేదములను విభజించినవాడు’ అని అర్థం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, వేద వ్యాసుడు వేదములను రచించాడు అని చెప్పబడటం లేదు, ఆయన వాటిని కేవలం విభజించాడు. కాబట్టి, వేదములను అపౌరుషేయములు అని కూడా అంటారు, అంటే ‘ఏ వ్యక్తి చేత సృష్టించబడినవి కావు.’ అవి ఆధ్యాత్మిక జ్ఞానమునకు పవిత్రమైన దోషరహితమైన ప్రమాణముగా గౌరవించబడుతాయి.

భూతం భవ్యం భవిష్యం చ సర్వం వేదాత్ ప్రసిధ్యతి

(మను స్మృతి 12.97)

‘ఏ ఆధ్యాత్మిక సూత్రమయినా అది వేద ప్రమాణముగా ఆమోదించబడాలి.’ వేదముల ఈ యొక్క జ్ఞానమును విశదీకరించటానికి, ఎంతో మంది ఋషులు గ్రంథాలను రచించారు మరియు అవి వేద ప్రమాణమునకు లోబడి ఉంటాయి కాబట్టి అవి వైదిక వాఙ్మయంలో భాగంగానే అనాదిగా పరిగణించబడ్డాయి. కొన్ని ముఖ్యమైన వైదిక గ్రంథాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి.

ఇతిహాసాలు: ఇవి చారిత్రాత్మక గ్రంథాలు, ఇవి రెండు, రామాయణము మరియు మహాభారతము. భగవంతుని యొక్క రెండు ముఖ్యమైన అవతారముల గురించి ఉన్న చరిత్రలను ఇవి తెలియచెపుతాయి. రామాయణము, వాల్మీకి మహర్షిచే రచించబడినది; ఇది శ్రీ రామచంద్ర భగవానుని యొక్క లీలలను వివరిస్తుంది. ఆశ్చర్యముగా, శ్రీ రామచంద్రుడు తన లీలలను ప్రదర్శించక పూర్వమే, ఇది వాల్మీకిచే రచించబడినది. గొప్ప కవి అయిన ఈ ఋషికి దివ్య దృష్టి ప్రసాదించబడినది, దీనితో, శ్రీ రామచంద్రుడు ఈ భూలోకంపైకి వచ్చినప్పుడు చేసే లీలలను ఆయన చూడగలిగాడు. ఈ విధంగా ఆయన ఇరవై నాలుగు వేల మనోహరమైన సంస్కృత శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. విభిన్న సామాజిక పాత్రలలో, అన్న/తమ్ముడు, కొడుకు, భార్య, రాజు, మరియు భార్యాభర్తలు మొదలగు వాటిలో మనం ఎలా నడుచుకోవాలో కూడా ఈ శ్లోకాలు మనకు ఉపదేశం ఇస్తాయి. రామాయణము ఎన్నో భారతీయ ప్రాంతీయ భాషల్లో రచించబడినది, దీనితో ఈ కావ్యం యొక్క ప్రజాదరణ మరింత పెరిగింది. వీటిల్లో అత్యంత ప్రజాదరణ పొందినది, హిందీ రామాయణము, 'రామచరిత్ మానస్'; ఇది శ్రీ రాముడి గొప్ప భక్తుడైన సంత్ తులసీదాస్‌చే రచించబడినది.

మహాభారతము వేద వ్యాస మహర్షిచే రచించబడినది. అది లక్ష శ్లోకాలు కలిగున్నది మరియు ప్రపంచములో కెల్లా అతి పెద్ద కావ్యముగా పరిగణించబడుతున్నది. శ్రీ కృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలు మహాభారతము యొక్క ముఖ్యమైన ఇతివృత్తం. మనుష్య జీవనానికి సంబంధించి ఉన్న వివిధ దశలలో చేయవలసిన వేర్వేరు ధర్మముల గురించి, మరియు భగవత్ భక్తికి సంబంధించి ఎంతో జ్ఞానాన్ని ఇది ప్రతిపాదిస్తున్నది.

భగవద్గీత అనేది మహాభారతములో అంతర్గతంగా ఉన్న భాగము. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హైందవ గ్రంథము ఎందుకంటే, శ్రీ కృష్ణ భగవానుడే స్వయముగా, అత్యంత మనోహరముగా వివరించిన ఆధ్యాత్మిక జ్ఞాన సారాంశము ఇందులో నిక్షిప్తమై ఉంది. ఇది ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదించబడినది. భగవద్గీత పై అసంఖ్యాకమైన వ్యాఖ్యానాలు కూడా రచించబడ్డాయి.

పురాణాలు : పురాణములు పద్దెనిమిది, ఇవి వేద వ్యాసునిచే రచింపబడ్డాయి. వీటన్నిటిలో మొత్తం కలిపి నాలుగు లక్షల శ్లోకాలున్నాయి. ఇవి విభిన్న భగవత్ స్వరూపాల యొక్క దివ్య లీలలను మరియు ఆయన భక్తులను వివరిస్తాయి. పురాణములు తత్త్వ జ్ఞానముతో కూడా నిండి ఉంటాయి. అవి - జగత్తు యొక్క సృష్టి, దాని లయము, పునఃసృష్టి, మానవ జాతి చరిత్ర, దేవతల మరియు ఋషుల వంశానుచరితములను వివరిస్తాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది భాగవత పురాణము లేదా శ్రీమద్భాగవతము. ఇది వేద వ్యాసునిచే రచింపబడిన చిట్ట చివరి పురాణము. దానిలో, సర్వోన్నత ధర్మమైన, భగవంతుని పట్ల నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమను, వర్ణించబోతునట్టుగా ఆయన పేర్కొంటాడు. తత్త్వపరంగా భగవత్ గీత ఎక్కడ ముగుస్తుందో అక్కడ శ్రీమద్ భాగవతం ప్రారంభమౌతుంది.

షడ్-దర్శన్ : వైదిక గ్రంథాలలో తదుపరి ప్రాముఖ్యత వీటికి ఉంది. హైందవ వేదాంతశాస్త్రములో ఒక్కొక్క ప్రత్యేకమైన విషయంపై ఆరుగురు ఋషులు ఆరు గ్రంథాలను రచించారు. ఇవి షడ్-దర్శన్ గా ప్రాచుర్యం పొందాయి, అంటే ఆరు తత్త్వ శాస్త్రాలు అని అర్థం. ఇవి:

— మీమాంస: ఇది జైమిని మహర్షి చే రచించబడినది, ఇది కర్మ కాండ విధులను మరియు పూజాది కార్యాలను వివరిస్తుంది.

— వేదాంత దర్శన్: ఇది మహర్షి వేదవ్యాసునిచే రచించబడినది, ఇది పరమ సత్యము యొక్క స్వభావాన్ని వివరిస్తుంది.

— న్యాయ దర్శన్: ఇది గౌతమ మహర్షిచే రచించబడినది. ఇది జీవితమును మరియు పరమ సత్యమును అర్థం చేసుకోవటానికి ఒక తర్కబద్ధమైన పద్ధతిని ప్రతిపాదిస్తుంది.

— వైశేషిక దర్శన్: ఇది కణాద మహర్షిచే రచించబడినది. విశ్వనిర్మాణ శాస్త్రమును మరియు సృష్టిని, దాని యొక్క మూలద్రవ్యముల పరంగా విశ్లేషిస్తుంది.

— యోగ దర్శన్ : ఇది మహర్షి పతంజలిచే రచించబడినది. శారీరక భంగిమలతో మొదలుపెట్టి, ఇది భగవంతునితో ఏకమవ్వటానికి ఎనిమిది స్థాయిల మార్గమును వివరిస్తుంది.

— సాంఖ్య దర్శన్ : ఇది కపిల మహర్షిచే రచించబడినది. భౌతిక శక్తి యొక్క ప్రాథమిక స్వరూపమైన ప్రకృతి నుండి విశ్వము జనించే విషయమును ఇది వివరిస్తుంది.

ఈ పైన వివరించబడినవే కాక, హైందవ ధర్మంలో ఎన్నోవందల శాస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటిని ఇక్కడ వివరించటం అసాధ్యం. వైదిక గ్రంథాలు అనేవి, భగవంతునిచే మరియు ఋషులచే, సమస్త మానవజాతి సంక్షేమానికి తెలియచేయబడిన విశాలమైన దివ్య జ్ఞాన భాండాగారాలు అని తెలుసుకుంటే సరిపోతుంది.

ఈ యొక్క శాస్త్ర గ్రంథాలలో, బ్రహ్మ సూత్రములు (వేదాంత దర్శనము) అనేది - ఆత్మ, భౌతిక శరీరము మరియు భగవానుడు - వీటికి మధ్య ఉన్న వైవిధ్యాన్ని స్పష్టంగా తెలియచేయటంలో అత్యంత ప్రామాణికముగా పరిగణించబడుతుంది. అందుకే, శ్రీ కృష్ణుడు దీనిని ప్రత్యేకంగా ఈ పై శ్లోకంలో పేర్కొంటున్నాడు. ‘వేద్’ అంటే వేదములు మరియు ‘అంత్’ అంటే ‘ముగింపు’ అని. కావున, ‘వేదాంతము’ అంటే ‘వైదిక జ్ఞానమునకు ముగింపు’ అని అర్థం.

వేదాంత దర్శనమును వేద వ్యాస ఋషి రచించినా, చాలా మంది పండితులు దానిని తత్త్వ సిద్ధాంతానికి ప్రామాణికంగా పరిగణించి, ఆత్మ మరియు భగవంతుని తత్త్వములపై తమ యొక్క విలక్షణమైన అభిప్రాయాన్ని స్థాపించటానికి దానిపై వ్యాఖ్యానాలు రచించారు. వేదాంత దర్శన్ పై జగద్గురు శంకరాచార్య గారి భాష్యాన్ని 'శారీరక భాష్యము' అంటారు; ఇది అద్వైత వాద సిద్ధాంతానికి పునాది వేస్తున్నది. ఆయన శిష్యులు ఎంతో మంది, వాచస్పతి మరియు పద్మపాదుడు వంటి వారు ఆయన భాష్యాన్ని మరింత విస్తారంగా వివరించారు. జగద్గురు నింబర్కాచార్య గారు 'వేదాంత పారిజాత సౌరభము' అనే గ్రంథాన్ని రచించారు; అది ద్వైత-అద్వైత వాదమును వివరిస్తుంది. జగద్గురు రామానుజాచార్య గారి వ్యాఖ్యానాన్ని ‘శ్రీ భాష్యము’ అంటారు; ఇది విశిష్ట-అద్వైత వాద సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నది. జగద్గురు మధ్వాచార్య గారి వ్యాఖ్యానాన్ని 'బ్రహ్మ సూత్ర భాష్యము' అంటారు; ఇది ద్వైత వాద సిధ్ధాంతానికి మూలాధారము. వల్లభాచార్య మహాప్రభు 'అణు భాష్యము' ను రచించారు, దీనిలో వారు శుధ్ధఅద్వైత వాద తత్త్వమును ప్రతిపాదించారు. వీరే కాక, మిగతా ప్రఖ్యాత వ్యాఖ్యాతలైన - భట భాస్కర, యాదవ ప్రకాశ, కేశవ, నీలకంఠ, విజ్ఞానభిక్షు, మరియు బలదేవ విద్యాభూషణుడు కూడా ఉన్నారు.

చైతన్య మహాప్రభు, తానే స్వయముగా ఒక మహోన్నత వేద పండితుడైనా, తాను వేదాంత దర్శనం పై వ్యాఖ్యానం రచించలేదు. ఆయన అభిప్రాయంలో, వేదాంత దర్శనం వ్రాసిన వేద వ్యాసుడే స్వయముగా, తన యొక్క చిట్టచివరి పురాణము శ్రీమద్ భాగవతమే, దానిపై ఒక చక్కటి సంపూర్ణ వ్యాఖ్యానము, అని అన్నాడు.

అర్థోయం బ్రహ్మసూత్రాణమ్ సర్వోపనిషదామపి

‘శ్రీమద్ భాగవతము అనేది వేదాంత దర్శనము మరియు సర్వ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మరియు అర్థాన్ని వివరిస్తుంది.’ కాబట్టి, వేద వ్యాసునిపై ఉన్న అపారమైన గౌరవం కొద్దీ, చైతన్య మహాప్రభు, వేదాంత దర్శనం పై ఇంకొక భాష్యమును రచించటం అవసరం లేదు అని భావించాడు.