కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ।। 16 ।।
కర్మణః — కర్మ యొక్క; సు-కృతస్య — పవిత్రమైన; ఆహుః — చెప్పబడును; సాత్త్వికం — సత్త్వ గుణము; నిర్మలం — స్వచ్ఛమైన; ఫలం — ఫలితము; రజసః — రజో గుణము; తు — నిజముగా; ఫలం — ఫలము; దుఃఖం — దుఃఖము; అజ్ఞానం — అజ్ఞానము; తమసః — తమో గుణము; ఫలం — ఫలితము.
Translation
BG 14.16: సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.
Commentary
సత్త్వ గుణము ప్రధానముగా ఉన్నవారు, స్వచ్ఛత, సద్గుణము, జ్ఞానము, మరియు నిస్వార్థముతో ఉంటారు. కాబట్టి, వారి యొక్క పనులు మిగతావారి తో పోల్చితే పవిత్రమైన ఉద్దేశంతో ఉంటాయి మరియు ఆ యొక్క ఫలితములు ఉద్ధరించేవిగా మరియు తృప్తినిచ్చేవిగా ఉంటాయి. రజో గుణముచే ప్రభావితమయ్యేవారు తమ మనస్సు-ఇంద్రియముల యొక్క కోరికలచే ఉద్వేగానికి గురౌతుంటారు. వారి యొక్క పనుల వెనుక ప్రధానోద్దేశం సొంత-గొప్పలు మరియు తమ యొక్క, తమ వారి యొక్క ఇంద్రియ-తృప్తి, ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క పనులు ఇంద్రియ భోగానుభవము కోసం ఉంటాయి, అవి ఇంద్రియ వాంఛలను మరింత విజృభింప చేస్తాయి. తమో గుణము ప్రబలంగా ఉన్నవారికి, శాస్త్ర ఉపదేశాల పట్ల మరియు మంచి నడవడిక (సత్ప్రవర్తన) పట్ల ఏ మాత్రం గౌరవం ఉండదు. వారు పాపపు పనులు చేస్తూ వక్రబుద్ధితో భోగవిలాసాలను అనుభవిస్తుంటారు, ఇది వారిని మరింత మోహభ్రాంతి లోనికి నెట్టివేస్తుంది.