ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ।। 18 ।।
ఊర్ధ్వం — ఉన్నత స్థాయి; గచ్ఛంతి — చేరుకుంటారు; సత్త్వ-స్థాః — సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు; మధ్యే — మధ్య స్థాయిలో; తిష్ఠంతి — ఉండిపోవుదురు; రాజసాః — రజో గుణములో నుండే వారు; జఘన్య — అసహ్యమైన; గుణ — గుణముల; వృత్తి-స్థాః — కార్యములలో నిమగ్నమైన వారు; అధః — నీచ; గచ్ఛంతి — వెళ్లెదరు; తామసాః — తమో గుణములో ఉండేవారు.
Translation
BG 14.18: సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయి లోనే ఉండిపోతారు; తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలౌతారు.
Commentary
జీవాత్మల పునర్జన్మ, వాటి వ్యక్తిత్వంలో ప్రబలంగా ఉండే గుణముల మీద ఆధారపడి ఉంటుందని, శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రస్తుత జన్మ ప్రయాణాన్ని పూర్తి చేసిన పిదప, జీవులు వారివారి గుణములకు అనుగుణంగా ఉండే లోకాలకు చేరుకుంటాయి. విద్యార్థులు ఉన్నత-పాఠశాల చదువులు పూర్తయిన తరువాత కళాశాలకు దరఖాస్తు చేయటంతో దీనిని పోల్చవచ్చు. దేశంలో చాలా కళాశాలలు ఉంటాయి. పాఠశాల స్థాయిలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు మంచిపేరున్న కళాశాలలో సీటు వస్తుంది; కానీ బొటాబొటి మార్కులే వఛ్చిన వారికి తక్కువ స్థాయి కళాశాలలలోనే సీటు ఇస్తారు. ఈ ప్రకారంగానే, భాగవతం లో ఇలా పేర్కొనబడినది:
సత్త్వే ప్రలీనాః స్వర్ యాంతి నర-లోకం రజో-లయాః
తమో-లయాస్ తు నిరయం యాంతి మామ్ ఏవ నిర్గుణాః (11.25.22)
‘సత్త్వ గుణములో ఉన్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెళ్లెదరు; రజో గుణములో ఉండేవారు భూలోకమునకు తిరిగి వస్తారు; మరియు తమో గుణములో ఉండేవారు నరక లోకములకు వెళతారు. మరియు త్రిగుణాతీతులైనవారు నన్నే పొందుదురు.’