Bhagavad Gita: Chapter 14, Verse 21

అర్జున ఉవాచ ।
కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।

అర్జున ఉవాచ — అర్జునుడు ఇలా అడిగెను; కైః — ఎటువంటి; లింగైః — లక్షణములు; త్రీన్ — మూడు; గుణాన్ — ప్రకృతి గుణములు; ఏతాన్ — ఇవి; అతీతః — అతీతులైన వారు; భవతి — ఉందురు; ప్రభో — ప్రభూ; కిం — ఏమిటి? ఆచారః — నడవడిక; కథం — ఎట్లా; చ — మరియు; ఏతాన్ — ఇవి; త్రీన్ — మూడు; గుణాన్ — ప్రకృతి గుణములు; అతివర్తతే — అతీతులు అవుతారు.

Translation

BG 14.21: అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?

Commentary

అర్జునుడు శ్రీ కృష్ణుడి నుండి త్రి-గుణములకు అతీతులవటం గురించి విని ఉన్నాడు. అందుకే, ఇప్పుడు ఈ త్రి-గుణముల విషయమై మూడు ప్రశ్నలను అడుగుతున్నాడు. 'లింగైః' అంటే 'లక్షణములు' అని అర్థం. అతని మొదటి ప్రశ్న ఏమిటంటే, ‘ఈ త్రిగుణాతీతుల లక్షణములు ఎలా ఉంటాయి?’ అని. ‘ఆచారః' అంటే 'ప్రవర్తన' అని అర్థం. అర్జునుడి రెండవ ప్రశ్న ఏమిటంటే: ‘ఈ త్రిగుణాతీతుల ప్రవర్తన ఎలా ఉంటుంది?’ అని. 'అతివర్తతే' అంటే 'అతీతులైపోవటం'. మూడవ ప్రశ్న ఏమిటంటే: ‘ఈ త్రి-గుణములకు అతీతులము కావటం ఎలా?’ అతని ప్రశ్నలకు పద్ధతిప్రకారం సమాధానం చెప్తున్నాడు, శ్రీ కృష్ణుడు.