Bhagavad Gita: Chapter 15, Verse 1

శ్రీ భగవానువాచ ।
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 1 ।।

శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; ఊర్ధ్వ-మూలం — వేర్లు పైకి; అధః — క్రిందికి; శాఖం — కొమ్మలు; అశ్వత్థం — రావి చెట్టు; ప్రాహుః — అని అంటారు; అవ్యయమ్ — సనాతనమైన; ఛందాంసి — వేద మంత్రములు; యస్య పర్ణాని — దేని ఆకులో; యః — ఎవరైతే; తం — అది; వేద — తెలుసుకుందురో; సః — అతను; వేదవిత్ — వేదములు ఎఱిగిన వాడు.

Translation

BG 15.1: శ్రీ భగవానుడు పలికెను : వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు.

Commentary

అశ్వత్థ అన్న పదానికి అర్థం, ఉన్నది ఉన్నట్టుగా ఒక్కరోజు కూడా (మరుసటి రోజువరకు కూడా) ఉండనిది అని అర్థం. ఈ జగత్తు కూడా అశ్వత్థ మే, ఎందుకంటే ఇది కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. సంస్కృత నిఘంటువు ఈ జగత్తుని ఇలా నిర్వచించింది, సంసరతీతి సంసారః ‘నిరంతరం మారుతూ ఉండేదే ఈ సంసారము’. గచ్ఛతీతి జగత్, ‘ఎల్లప్పుడూ కదులుతూ ఉండేదే జగత్తు’. ఈ జగత్తు ప్రతినిత్యం మారుతూ ఉండటమే కాక, అది ప్రళయ వినాశనం చేయబడి తిరిగి భగవంతునిలోనికి ఒక రోజు తీసుకొనబడుతుంది. అందుకే దానిలో ఉండేది అంతా తాత్కాలికమైనదే, అంటే అశ్వత్థమే.

అశ్వత్థ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది - రావి చెట్టు అని. ఆత్మకు, ఆ భౌతిక జగత్తు ఒక చాలా విశాలమైన అశ్వత్థ వృక్షము వంటిది అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. సాధారణంగా వృక్షములకు వేర్లు క్రిందికి మరియు కొమ్మలు పైకి ఉంటాయి. కానీ ఈ వృక్షమునకు వేర్లు పైకి ఉంటాయి (ఊర్ధ్వ మూలం), అంటే అది భగవంతుని నుండి ఉత్పన్నమైనది, ఆయన యందే స్థితమై ఉన్నది మరియు ఆయనచేతనే పోషించి/నిర్వహించబడుతున్నది. ఆ చెట్టుబోదె, శాఖలు/కొమ్మలు క్రిందికి (అధః శాఖం) విస్తరించి ఉన్నాయి, వాటియందే భౌతిక జగత్తు లోని లోకాల సమస్త జీవరాశులు స్థితమై ఉన్నాయి.

కర్మ కాండలు మరియు వాటి ఫలములు చెప్పే వేద మంత్రములు (ఛందాంసి) ఈ వృక్షము యొక్క ఆకులు. ఈ భౌతిక అస్తిత్వమనే వృక్షమునకు అవి పోషకములు. వేదమంత్రములలో చెప్పబడిన ఫలాపేక్ష గల యజ్ఞ కర్మ కాండలు చేయటం వలన ఆత్మ, స్వర్గ భోగములను అనుభవించటానికి స్వర్గాది లోకములకు వెళుతుంది; కానీ ఆ పుణ్యము క్షయమై పోయినప్పుడు తిరిగి క్రిందన భూలోకానికి చేరుతుంది. ఈ విధంగా, ఆ చెట్టు యొక్క ఆకులు దానిని నిరంతరం జనన-మరణ చక్రంలో ఉంచుతూ పోషిస్తాయి. ఈ జగత్తు రూపంలో ఉండే వృక్షము సనాతనమైనది (అవ్యయం) అంటారు, ఎందుకంటే దాని ప్రవాహం నిరంతరంగా జరుగుతుంటుంది మరియు దాని యొక్క ఆది మరియు అంత్యము జీవాత్మల అనుభవంలోకి రాదు. ఎలాగైతే నిరంతర ప్రక్రియలో, సముద్రము యొక్క నీరు ఆవిరై మేఘములాగా మారి, మరల వానలాగా భూమిపై పడి అంతిమముగా తిరిగి సముద్రం చేరుతుందో, ఈ జనన-మరణ చక్రము కూడా నిరంతరం సాగుతూ ఉంటుంది.

వేదములు కూడా ఈ వృక్షమును పేర్కొన్నాయి:

ఊర్ధ్వమూలోఽవాక్ శాఖ ఏషోఽశ్వత్థ సనాతనః

(కఠోపనిషత్తు 2.3.1)

‘వేర్లు పైకి మరియు శాఖలు క్రిందికి ఉన్న అశ్వత్థ వృక్షము సనాతనమైనది’

ఊర్ధ్వమూలం అర్వాక్ శాఖం వృక్షం యో సంప్రతి
న స జాతు జనః శ్రద్దయాత్ మృత్యుత్యుర్మా మారయదితి

(తైత్తిరీయ ఆరణ్యక్ 1.11.5)

‘ఈ యొక్క వేర్లు పైకి మరియు శాఖలు క్రిందికి ఉన్న వృక్షమును ఎరిగినవారు, మృత్యువు వారిని అంతం చేస్తుంది అని విశ్వసించరు’

వేదములు ఈ వృక్షమును గురించి వివరించేది దానిని ఖండించటానికి ప్రయత్నించమని చెప్పటానికే. అందుకే, శ్రీ కృష్ణుడు, ఈ సంసార వృక్షమును ఖండించాలనే రహస్యమును తెలిసినవారు, వేదములు తెలిసినవారు (వేద విత్) అని అంటున్నాడు.