Bhagavad Gita: Chapter 15, Verse 14

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ।। 14 ।।

అహం — నేను; వైశ్వానరః — భోజనము జీర్ణించు/అరిగించు అగ్ని (జఠరాగ్ని); భూత్వా — అయిఉండి; ప్రాణినాం — సర్వ ప్రాణులలో; దేహం — శరీరము; ఆశ్రితః — ఉన్నవాడినై; ప్రాణ-అపాన — ప్రాణ-అపానములు (బయటకువెళ్ళే మరియు లోనికి వచ్చే శ్వాస); సమాయుక్తః — సమముగా ఉంచుతూ; పచామి — జీర్ణము చేయుదును; అన్నం — ఆహారములు; చతుః-విధం — నాలుగు రకముల.

Translation

BG 15.14: నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను.

Commentary

పిత్తాశయము, క్లోమము, కాలేయము మొదలైనవి సృజించే జీర్ణరసాయనాలే, జీర్ణశక్తికి కారణం అని శాస్త్రవేత్తలు అంటారు. కానీ, ఇటువంటి ఆలోచన చాలా అమాయకమైనది అని ఈ శ్లోకం తెలియచేస్తున్నది. ఇవన్నీ జీర్ణరసముల వెనుక, భగవంతుని శక్తి ఉంది, అదే ఈ జీర్ణవ్యవస్థను పనిచేపిస్తుంది. వైశ్వానర అంటే, ‘జఠరాగ్ని’, (ఆహారమును జీర్ణము చేసే అగ్ని), అది భగవంతుని శక్తి చే రగులుతుంది. బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ఇలా పేర్కొంటుంది:

అయం అగ్నిర్ వైశ్వానరో యో ఽయం అంతః పురుషే
యేనేదం అన్నం పచ్యతే (5.9.1)

‘జీవ ప్రాణులు ఆహారమును జీర్ణము చేసుకునేందుకు వాటి కడుపులో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే.’

ఈ శ్లోకములో సూచించబడిన నాలుగు రకముల (చతుర్విధమ్) ఆహారములు ఇవి: 1. భోజ్యములు: ఇవి పంటితో నమిలే ఆహారములు, అంటే, బ్రెడ్డు, రొట్టె వంటివి. 2. పేయములు: ఇవి మ్రింగబడేవి, పాలు, పండ్లరసములు వంటివి 3. కోష్యములు: ఇవి పీల్చబడే ఆహారములు, అంటే చెఱకు మొదలైనవి 4. లేహ్యములు. ఇవి నాకబడే ఆహారములు, అంటే, తేనె, ఐస్-క్రీమ్ మొదలగునవి.

12 నుండి 14వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు జీవఅస్తిత్వానికి కావలసినవన్నీ సమకూర్చేది భగవంతుడే అని చెప్పి ఉన్నాడు. ఆయనే ఈ భూమండలమును శక్తివంతం చేసి దానిని ఆవాసయోగ్యముగా చేసేది. చంద్రుడికి సమస్త వృక్షసంతతిని పోషించగలిగే శక్తిని ఇచ్చేది ఆయనే, మరియు ఆయనే జఠరాగ్నిగా మారి నాలుగు రకాల ఆహారములను జీర్ణం చేసేది. ఇక ఇప్పుడు, తానే సమస్త జ్ఞానమునకు లక్ష్యము అని చెప్తూ ఈ విషయాన్ని తదుపరి శ్లోకంతో ముగిస్తున్నాడు.