Bhagavad Gita: Chapter 15, Verse 7

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ।। 7 ।।

మమ — నా యొక్క; ఏవ — మాత్రమే; అంశా — అంశములు; జీవ-లోకే — భౌతిక ప్రపంచములో; జీవ-భూతః — జీవాత్మలు; సనాతనః — సనాతనమైన; మనః — మనస్సు; షష్ఠాని — ఆరు; ఇంద్రియాణి — ఇంద్రియములు; ప్రకృతి-స్థాని — ప్రకృతి స్వభావముచే బంధించివేయబడి; కర్షతి — శ్రమ పడుతున్నారు.

Translation

BG 15.7: భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.

Commentary

శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వం ఆయన ధామమునకు చేరిన జీవులు ఇక మళ్ళీ తిరిగి రారు అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, భౌతిక జగత్తు లోనే ఇంకా ఉండిపోయిన జీవుల గురించి చెప్తున్నాడు. మొదట, వీరు కూడా తన అంశములే అని మళ్ళీ ధైర్యం చెప్తున్నాడు.

కాబట్టి, భగవంతుడికి ఉన్న వివిధ అంశములను అర్థం చేసుకుందాం. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి:

స్వాంశలు. వీరు భగవంతుని అవతారములు, రాముడు, నృసింహ, వరాహ మొదలైనవారు. వారు శ్రీ కృష్ణునికి అభేదములు అందుకే వారిని స్వాంశలు అంటాము, అంటే ఏకీకృతమైన అంశములు అని అర్థం.

విభిన్నాంశములు. వీరు భగవంతునికి భిన్నములైన అంశములు. వారు నేరుగా భగవంతుని అంశములు కాదు, అయినా, వారు ఆయన యొక్క జీవ శక్తి యొక్క అంశములు. ఈ కోవలోకే జగత్తులో ఉన్న ఆత్మలు అన్నీ వస్తాయి. ఇది శ్రీ కృష్ణుడిచే 7.5వ శ్లోకంలో చెప్పబడినది. ‘భౌతిక శక్తి కన్నా ఉన్నతమైనది, ఓ మహా బాహువులు కల అర్జునా, ఇంకొక ఉత్కృష్ట మైన శక్తి కూడా ఉన్నది. అదే ఈ ప్రపంచంలో జీవరాశికి మూలమైన జీవాత్మలు.’

ఇంతేకాక, విభిన్నాంశ ఆత్మలు మూడు రకాలు:

నిత్య సిద్ధులు: వీరు ఎప్పుడూ విముక్తులైన వారే కాబట్టి భగవంతుని యొక్క దివ్య ధామములో, ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటూ, సనాతన కాలం నుండి ఉన్నవారు.

సాధన సిద్ధులు: ఈ జీవాత్మలు మనలాగే ఒకప్పుడు భౌతిక జగత్తులో ఉండేవారే, కానీ వారు తమ సాధనా అభ్యాసం ద్వారా ఆ భగవంతుడిని చేరుకున్నారు. ఇక ఇప్పుడు వారు దివ్య భగవత్ ధామము లోనే శాశ్వతంగా ఉంటూ భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటూ ఉంటారు.

నిత్య బద్ధులు: వీరు సనాతన కాలం నుండి భౌతిక జగత్తు లోనే ఉండిపోయినవారు. వీరు ఐదు ఇంద్రియములు మరియు మనస్సుచే కట్టివేయబడినారు, కాబట్టి వారు ప్రయాస పడుతున్నారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

‘పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూః’ "(2.1.1)

‘సృష్టికర్త బ్రహ్మ, ఇంద్రియములను బహిర్ముఖంగా, ప్రపంచంవైపు మర్లేటట్టు తయారుచేసాడు.’ ఈ యొక్క విభిన్నాంశలైన నిత్య బద్ద అంశముల గురించి, శ్రీ కృష్ణుడు, వారు మనస్సు ఇంద్రియములను తృప్తిపరచటానికి ప్రయాసపడుతూ, ఆ క్రమంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని అంటున్నాడు. ఇక తదుపరి శ్లోకంలో, ఆత్మ మరణ సమయంలో ఇంకొక శరీరమునకు వెళ్ళినప్పుడు మనస్సు ఇంద్రియములకు ఏమవుతుందో శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.