చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః ।
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ।। 11 ।।
చింతాం — చింతలు/ఆందోళనలు; అపరిమేయాం — అంతులేని; చ — మరియు; ప్రలయ-అంతాం — మరణించే వరకూ; ఉపాశ్రితాః — ఆశ్రయించిన వారు; కామ-ఉపభోగ — విషయభోగాలంపటులై; పరమాః — జీవిత ప్రయోజనము; ఏతావత్ — అయినా సరే (ఇంకా ఇదే); ఇతి — ఈ విధముగా; నిశ్చితాః — సంపూర్ణ నిశ్చయముతో ఉందురు.
Translation
BG 16.11: వారు అంతులేని చింతలు/ఆందోళనలచే సతమతమై పోతుంటారు, అవి చివరికి మరణం తోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు.
Commentary
భౌతిక దృక్పథంలో ఉన్న జనులు తరచుగా ఆధ్యాత్మిక మార్గాన్ని - అది కష్టతరమైనది మరియు భారమైనది అని, మరియు అంతిమ లక్ష్యం చాలా దూరమైనది - అని తిరస్కరిస్తారు. త్వరగా ఫలితాలను ఇచ్చే, ఈ ప్రాపంచిక మార్గాన్నే వారు అనుసరిస్తారు, కానీ, ఆ ప్రాపంచిక మార్గంలో ఇంకా ఎక్కువ బాధలు పడుతుంటారు. భౌతిక సంపాదనలకై ఉన్న వారి కోరికలు వారిని క్షోభకి గురిచేస్తుంటాయి మరియు వారి ఆశయాలను పూర్తిచేసుకోవటానికి ఏవేవో పెద్ద పెద్ద ప్లానులు (ప్రణాళికలు) వేసుకుంటారు. వారు కోరుకున్న వస్తువు పొందగానే, కాసేపు ఉపశమనం పొందినా, వెంటనే కొత్త క్షోభ మొదలవుతుంది. వారు సంపాదించిన వస్తువును ఇతరులెవరైనా తీస్కుంటారేమో అన్న ఆందోళనతో, దానిని కాపాడుకోవటానికి శ్రమిస్తుంటారు. చిట్టచివరికి, ఆ మమకారాసక్తి ఉన్న వస్తు-విషయంతో అనివార్యమైన ఎడబాటు సంభవించినప్పుడు, మిగిలేది దుఃఖమే. అందుకే ఇలా పేర్కొనబడినది:
యా చింతా భువి పుత్ర పౌత్ర భరణవ్యాపార సంభాషణే
యా చింతా ధన ధాన్య యశసాం లాభే సదా జాయతే
సా చింతా యది నందనందన పదద్వంద్వార విందేక్షణం
కా చింతా యమరాజ భీమ సదన్ద్వారప్రయాణే విభో
(సూక్తి సుధాకరం)
‘ఈ ప్రపంచంలో జనులు చెప్పలేని బాధలను మరియు ఒత్తిడిని, ప్రాపంచిక ప్రయాసలో అనుభవిస్తుంటారు - బిడ్డలను, మనుమళ్లను పెంచటం, వ్యాపారం చేయటం, ఆస్తి-పాస్తులను కూడబెట్టడం, మరియు కీర్తిప్రతిష్ఠ సంపాదించుకోవడం వంటివి. వారు గనక ఇదే విధమైన అనురాగము, శ్రద్ధ ఆ శ్రీ కృష్ణుడి పాదారవిందముల వద్ద ప్రేమను పెంచుకోవటంలో చూపిస్తే, వారు ఇక ఎన్నటికీ ఆ మృత్యు దేవత, యమరాజు గురించి చింతించవలసిన అవసరం ఉండదు. (ఎందుకంటే వారు ఈ జనన-మరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు).’ కానీ, ఆసురీప్రవృత్తి కలవారు ఈ పచ్చినిజాన్ని ఒప్పుకోవటానికి తిరస్కరిస్తారు, ఎందుకంటే, ఈ ప్రాపంచిక సుఖాలే అత్యున్నత ఆనందము అని వారి బుద్ధులు నిశ్చయంతో ఉంటాయి. వారిని నికృష్ట లోకాలకు తీసుకుపోవటానికి మరియు మరింత దుఃఖపూరిత తదుపరి జన్మలలోకి తీసుకువెళ్ళటానికి మృత్యువు ఓర్పుతో నిరీక్షిస్తున్నది అని కూడా తెలుసుకోలేరు.