Bhagavad Gita: Chapter 16, Verse 7

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః ।
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ।। 7 ।।

ప్రవృత్తిం — మంచి నడవడిక; చ — మరియు; నివృత్తిం — చెడు నడవడిక; చ — మరియు; జనాః — జనులు ; న, విదుః — అర్థం చేసుకోరు; ఆసురాః — ఆసురీ స్వభావము కలవారు; న శౌచం — స్వచ్ఛత లేకుండా; న — కాదు; అపి — కూడా; చ — మరియు; ఆచారః — నడవడిక; న — కాదు; సత్యం — సత్య సంధత; తేషు — వారిలో; విద్యతే — ఉండును.

Translation

BG 16.7: ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు.

Commentary

ధర్మము అంటే ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతకు మరియు సర్వ భూతముల సాధారణ సంక్షేమానికి దోహదపడే నియమములు. అధర్మము అంటే దిగజారిపోవటానికి దారితీసే మరియు సమాజానికి హాని చేసే, నిషేధింపబడ్డ పనులు. ఆసురీ స్వభావము అనేది జ్ఞానము యందు మరియు శాస్త్ర విజ్ఞానము పట్ల విశ్వాసరాహిత్యముగా ఉంటుంది. కాబట్టి, దాని ప్రభావంలో ఉన్నవారు, ఏది ఒప్పో ఏది తప్పో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు.

పాశ్చాత్య తత్త్వశాస్త్రములో ప్రస్తుత పరిణామాలే దీనికి ఒక విశిష్ట ఉదాహరణ. ‘రేనైసెన్స్’ తరువాత, ఎన్లైటెన్మెంట్, హ్యుమనిసం, ఏమ్పిరిసిసం, కమ్యూనిసం, ఎక్సిస్టేన్సియలిసం, మరియు స్కెప్టిసిసం (Enlightenment, Humanism, Empiricism, Communism, Existentialism, and Skepticism) వంటి సిద్ధాంతాలను దాటి ఎదిగిన తరువాత, ప్రస్తుతం ఉన్న పాశ్చాత్య తత్త్వ-సిద్ధాంతాన్ని ‘పోస్ట్-మోడరనిసం’ (Post-modernism) అంటున్నారు. ఈ యొక్క పోస్ట్-మోడరనిస్ట్ తత్త్వములో సర్వ సాధారణముగా అనేదేమిటంటే, పరమ సత్యము అనేది ఏమీ లేదు అని. పరమ సత్యము అనేది ఒకటి ఉంటుంది అనే భావనను జనులు తిరస్కరించారు. ‘అంతా సాపేక్షమే’ (All is relative) అనేది పోస్ట్-మోడరనిస్ట్ కాలము యొక్క పిలుపుగా అయిపోయింది. మనము తరచుగా , ‘అది నీకు సత్యమే కావచ్చు కానీ, నాకు కాదు’ అని వింటుంటాము. సత్యము అనేది ఒక వ్యక్తి యొక్క పరిధి లోబడి ఉండే వ్యక్తిగత అభిరుచి లేదా భావము అనే పరిస్థితి వచ్చింది. ఈ దృక్పథం, ఏది ఒప్పు ఏది తప్పు అని నిర్ణయించే నైతికధర్మాలపై చాలా ప్రగాఢమైన ప్రభావం చూపుతుంది. ఒకవేళ పరమ సత్యము అన్నది ఏమీ లేకపోతే, అంతిమంగా ఏది నైతిక ఒప్పు ఏది తప్పు అనేది, ఏ విషయం పైనా స్థిరంగా ఉండదు. అప్పుడు, జనులు ఈ విధంగా అనటం సరియైనది అయిపోతుంది, ‘అది నీకు ఒప్పు కావచ్చు, అంత మాత్రం చేత అది నాకు ఒప్పు అవ్వాల్సిన అవసరం లేదు.’ అని.

ఇటువంటి ఆలోచన చాలా మందికి బాగా నచ్చుతుంది, కానీ దాని యొక్క తర్కమును లోతుగా తీసుకెళితే అది అసంబద్ధమైనది మరియు ప్రమాదకరమైనది అని రుజువుఅవుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించకపోవడం ఒప్పుగానే అనిపిస్తే, ఆ వ్యక్తి, తాను ఒప్పు అనుకున్నది చేయటం వలన, ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పెడతాడు. తనకు శత్రువులు అనిపించిన వారి జనసమ్మర్దం ఉన్న ప్రదేశంలో ఆత్మాహుతి దాడి చేయటం, ఎవరికైనా ఒప్పుగా అనిపిస్తే ఎలా? అతనికి మటుకు తాను చేసేది చాలా చాలా సరియైనదే అని అనిపించవచ్చు. కానీ, ప్రపంచానికి ఏమైనా అది సమంజసమే అని అనిపిస్తుందా? పరమ సత్యము అనేది ఏమీ లేకపోతే, ఎవరూ కూడా ‘ఇతను ఇలా చెయ్యాలి’ లేదా ‘ఈమె ఇలా చేయకూడదు’ అని గట్టిగా చెప్పలేరు. మహాఅయితే ఇలా చెప్పగలరు, ‘చాలా మంది జనులు ఈ పనిచేయటం మంచిది అనుకోరు.’ అని. ఈ యొక్క సాపేక్ష (relative) దృక్పథంలో, వ్యక్తి ఇలా బదులు ఇవ్వచ్చు, ‘అది నీకు సత్యమే కావచ్చు , కానీ మాకు మాత్రం ఖచ్చితంగా సత్యము కాదు.’ అని. పరమ సత్యమును తిరస్కరిస్తే, జరిగే అత్యంత ప్రమాదకరమైన పరిణామాలు ఇవి.

ఆసురీ స్వభావము అనేది ఏది మంచి ఏది చెడు, అన్న విషయంపై అయోమయ స్థితిలో ఉంటుంది, అందుకే వారిలో స్వచ్ఛత/పవిత్రత కానీ, సత్యము కానీ, సరియైన నడవడిక కానీ అగుపించవు అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. తదుపరి శ్లోకంలో, అటువంటి మనుష్యుల దృక్పథం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు.