17వ అధ్యాయము: శ్రద్ధా త్రయ విభాగ యోగము

శ్రద్ధా త్రయ విభాగ యోగము

పదునాలుగవ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను వివరించి ఉన్నాడు మరియు అవి మనుష్యులను ఏవిధంగా ప్రభావితం చేస్తాయో కూడా చెప్పాడు. ఈ పదిహేడవ అధ్యాయములో, ఈ త్రిగుణముల యొక్క ప్రభావము గురించి మరింత విస్తారముగా వివరిస్తున్నాడు. మొదటిగా, విశ్వాసము/శ్రద్ధ అనే విషయం గురించి వివరిస్తూ, ఎవ్వరూ కూడా విశ్వాస రహితముగా ఉండరు అని చెప్తున్నాడు, ఎందుకంటే అది మానవ నైజం యొక్క విడదీయలేని భాగము. కానీ, వారివారి మనస్తత్వం బట్టి, జనుల యొక్క విశ్వాసము (faith) అనేది, సాత్త్విక, రాజసిక, లేదా తామసిక రంగును కలిగిఉంటుంది. వారికి ఏ రకమైన విశ్వాసము ఉంటుందో వారి జీవితం కూడా ఆ రకంగానే ఉంటుంది. జనులకు ఆహారం పట్ల కూడా వారివారి గుణములకు అనుగుణంగానే మక్కువ ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఆహారాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తూ, మనపై వీటి యొక్క ప్రభావాన్ని వివరిస్తున్నాడు. ఆ తరువాత, కృష్ణుడు యజ్ఞముల గురించి చెప్తూ, ఈ మూడు ప్రకృతి త్రిగుణములలో, యజ్ఞములు వేర్వేరు రకాలుగా ఏ విధంగా ఉంటాయో వివరిస్తాడు. ఆ తర్వాత ఈ అధ్యాయము 'తపస్సు' అనే విషయం వైపు వెళుతుంది మరియు శరీర తపస్సు, వాక్ తపస్సు మరియు మనోతపస్సు లను వివరిస్తుంది. ఈ మూడు తపస్సులు సత్త్వ-రజ-తమో గుణములచే ప్రభావితం అయినప్పుడు అవి వేర్వేరు స్వరూపములలో మారతాయి. ఆ తరువాత 'దానము' అనే విషయం చర్చించబడుతుంది, మరియు దాని యొక్క మూడు రకాల విభాగములు వివరించబడుతాయి.
చివరగా, శ్రీ కృష్ణుడు త్రి-గుణములకు అతీతముగా వెళ్లి, ‘ఓం తత్ సత్’ అన్న పదముల యొక్క ప్రాముఖ్యత మరియు అర్థమును వివరిస్తాడు; ఇది పరమ సత్యము యొక్క విభిన్న అస్తిత్వములను సూచిస్తుంది. ‘ఓం’ అంటే, ఈశ్వరుని నిరాకార తత్త్వమును సూచిస్తుంది; ‘తత్’ అంటే, పరమేశ్వరుని కొరకు చేసే కార్యములు మరియు కర్మ-కాండలను పవిత్రం చేయటానికి ఉచ్చరించబడుతుంది. ‘సత్’ అంటే, నిత్య సనాతన శుభకరము మరియు మంగళము. ఈ మూడు కలిపి అన్నప్పుడు ఒక అలౌకిక సర్వోత్కృష్టతను కలిగిస్తాయి. శాస్త్ర నియమాలను పట్టించుకోకుండా చేయబడే యజ్ఞము, తపస్సు మరియు దానముల యొక్క నిరర్థకతని వివరిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది.

అర్జునుడు ఇలా అన్నాడు : ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించి (విస్మరించి) ఉండి, అయినా శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్త్వ గుణంలో ఉన్నట్టా లేదా రజో, తమో గుణములలో ఉన్నట్టా?

శ్రీ భగవానుడు ఇలా పలికెను : ప్రతి ఒక్క మానవుడు తన సహజసిద్ధ శ్రద్ధ/విశ్వాసము తో జన్మిస్తాడు, ఇది, సాత్త్వికము, రాజసము, లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము.

అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది.

సత్త్వ గుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు; రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు; తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు.

కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ దంభం(కపటత్వం) మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము.

వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము.

సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు, ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.

అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగ చేస్తాయి.

ఎండిపోయిన/మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము - తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి.

ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్త్వ గుణముతో చేయబడినట్టు.

ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.

శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును.

పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు, మరియు పెద్దలు - వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో - అది శారీరక తపస్సు అని చెప్పబడును.

ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది.

ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి.

భక్తి-శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులు అని అంటారు.

కీర్తిప్రతిష్టలు, గౌరవము, మరియు గొప్పల కోసం, ఆడంబరంగా చేసే తపస్సు/యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, మరియు తాత్కాలికమైనవి.

అయోమయ భావాలతో, తమని తామే హింసపెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది.

దానము చేయుట తన కర్తవ్యము అని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.

కానీ, అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము, రజో గుణములో ఉన్నదని చెప్పబడినది.

అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హతలేనివారికి (అపాత్రులకు), మర్యాద చూపకుండా, లేదా చులకనగా ఇవ్వబడిన దానము, తామసిక దానముగా పరిగణించబడుతుంది.

‘ఓం తత్ సత్’ అన్న పదములు, సృష్టి మొదలు నుండి, పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు, మరియు యజ్ఞములు ఏర్పడినవి.

కాబట్టి, యజ్ఞములు చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు, లేదా తపస్సులు ఆచరించటంలో – వేద-విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు.

ప్రతిఫలములను ఆశించని వారు, కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారు, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు ‘తత్’ అన్న పదమును ఉచ్చరిస్తారు.

‘సత్’ అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ ‘సత్’ అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా ‘సత్’ అనబడుతుంది.

ఓ ప్రిథ పుత్రుడా, అశ్రద్దతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ, లేదా తపస్సులు కానీ, ‘అసత్’ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చవు.