Bhagavad Gita: Chapter 17, Verse 1

అర్జున ఉవాచ ।
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ।। 1 ।।

అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; యే — ఎవరైతే; శాస్త్ర-విధిం — శాస్త్రములలో విధింపబడిన నియమములను; ఉత్సృజ్య — విస్మరించి (త్యజించి); యజంతే — పూజలు చేస్తుంటారో; శ్రద్ధయా-అన్వితాః — శ్రద్ధ-విశ్వాసములతో; తేషాం — వారి యొక్క; నిష్ఠా — విశ్వాసము; తు — నిజానికి; కా — ఏమిటి?; కృష్ణ — కృష్ణా; సత్త్వం — సత్త్వము; ఆహో — లేదా; రజః — రజో గుణము; తమః — తమో గుణము.

Translation

BG 17.1: అర్జునుడు ఇలా అన్నాడు : ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించి (విస్మరించి) ఉండి, అయినా శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్త్వ గుణంలో ఉన్నట్టా లేదా రజో, తమో గుణములలో ఉన్నట్టా?

Commentary

ఇంతకు క్రితం అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, ఏ ఏ సద్గుణములను పెంపొందించుకోవాలి మరియు ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలను త్యజించాలి అని అర్థం చేపించటానికి, దైవీ మరియు ఆసురీ స్వభావముల మధ్య తేడా వివరించి ఉన్నాడు. ఆ అధ్యాయం చివరలో, ఎవరైతే శాస్త్ర ఉపదేశాలను విస్మరిస్తూ, శారీరక ఉత్తేజాలను, మనస్సు యొక్క వెర్రితలంపులను అవివేకముగా అనుసరిస్తారో, వారు పరిపూర్ణత (సిద్ధి) లేదా సుఖాన్ని లేదా జనన-మరణ చక్రమునుండి విముక్తిని పొందజాలరు అని పేర్కొన్నాడు. అందుకే ఆయన జనులకు, శాస్త్ర ఉపదేశాలను అనుసరిస్తూ, తద్విధముగా ప్రవర్తించమని చెప్పాడు. ఆ ఉపదేశమే ఈ ప్రస్తుత ప్రశ్నకు దారి తీసింది. వేద శాస్త్రముల ఉపదేశాలు పట్ల విశ్వాసం లేకుండా పూజలు చేసే వారి యొక్క విశ్వాసము ఎలాంటిదో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ప్రత్యేకంగా, దీనికి సమాధానాన్ని, భౌతిక ప్రకృతి త్రిగుణముల పరంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు.