Bhagavad Gita: Chapter 17, Verse 24

తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ।
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ।। 24 ।।

తస్మాత్ — కాబట్టి; ఓం — పవిత్ర శబ్దము 'ఓం' ; ఇతి — ఈ విధముగా; ఉదాహృత్య — పలకటం ద్వారా; యజ్ఞ — యజ్ఞము; దాన — దానము; తపః — తపస్సు; క్రియాః — చేయుట; ప్రవర్తంతే — ప్రారంభంలో; విధాన-ఉక్తాః — వేద నియమముల ప్రకారం; సతతం — ఎల్లప్పుడూ; బ్రహ్మ-వాదినామ్ — వేదముల మంత్రములను పఠించువారు.

Translation

BG 17.24: కాబట్టి, యజ్ఞములు చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు, లేదా తపస్సులు ఆచరించటంలో – వేద-విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు.

Commentary

‘ఓం’ అనే శబ్దము భగవానుని నిరాకార అస్తిత్వమునకు సూచిక. అదే నిరాకార బ్రహ్మమునకు పేరు అని కూడా చెప్పబడుతుంది. అది ఈ విశ్వమంతా వ్యాప్తించి ఉన్న సనాతన శబ్దము. దాని యొక్క సరియైన ఉచ్చారణ ఏమిటంటే: ‘ఆ..’ అంటూ నోరు పెద్దదిగా అని, ‘ఓ...’ అని పెదవులు ముడుతచేసి అంటూ, మరియు "మ్.." అని పెదవులు దగ్గరగా మూసి అనటం. ఈ ‘ఓం’ కారమును వేద మంత్రముల ప్రారంభంలో బీజ మంత్రముగా, మంగళకరమైనదిగా ఉపయోగిస్తారు.