అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ।। 28 ।।
అశ్రద్ధయా — శ్రద్ధవిశ్వాసములు లేకుండా; హుతం — యజ్ఞము; దత్తం — దానము; తపః — తపస్సు; తప్తం — ఆచరించి; కృతం — చేయబడిన; చ — మరియు; యత్ — ఏదైతే; అసత్ — నశించిపోయేవి; ఇతి — ఈ విధముగా; ఉచ్యతే — అని చెప్పబడును; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; న — కాదు; చ — మరియు; తత్ — అది; ప్రేత్య — పరలోకములో; నో – కాదు; ఇహ — ఈ లోకములో.
Translation
BG 17.28: ఓ ప్రిథ పుత్రుడా, అశ్రద్దతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ, లేదా తపస్సులు కానీ, ‘అసత్’ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చవు.
Commentary
సమస్త వైదిక కర్మలు, శ్రద్ధావిశ్వాసములతో చేయబడాలి అన్న ఉపదేశమును స్థిరపరచటానికి, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, అది లేకుండా చేయబడే వైదిక కర్మలు ఎంత వ్యర్థమో ఇక చెప్తున్నాడు. శాస్త్రముల పట్ల విశ్వాసము లేకుండా కార్యములు చేసేవారు, ఈ లోకంలో మంచి ఫలితాలు పొందరు ఎందుకంటే వారి కర్మలు సక్రమ పద్ధతిలో చేసినవి అయిఉండవు. అంతేకాక, వేద శాస్త్రముల నియమముల అనుసారం చేయలేదు కాబట్టి వారికి తదుపరి జన్మలో కూడా మంచిఫలములు లభించవు. ఈ విధముగా, మన స్వంత మనోబుద్ధుల ఆధారముగా నమ్మకం (విశ్వాసం) ఉండకూడదు. బదులుగా, మన శ్రద్దావిశ్వాసములు నిర్వివాదమైన వైదిక శాస్త్రములు మరియు గురు ఉపదేశము ఆధారముగానే ఉండాలి. పదిహేడవ అధ్యాయం యొక్క ఉపదేశసారం ఇదే.