Bhagavad Gita: Chapter 18, Verse 1

అర్జున ఉవాచ ।
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ।। 1 ।।

అర్జునః ఉవాచ — అర్జునుడు పలికెను; సన్న్యాసస్య — కర్మలు త్యజించటములో; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; తత్త్వమ్ — సత్యము; ఇచ్ఛామి — కోరుతున్నాను; వేదితుమ్ — తెలుసుకొనుటకు; త్యాగస్య — కర్మ ఫలములను భోగించాలనే కోరికను త్యజించటం యొక్క; చ — మరియు; హృషీకేశ — కృష్ణా, ఇంద్రియములకు ప్రభూ; పృథక్ — భేదమును; కేశి-నిషూదన — కృష్ణ, కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా.

Translation

BG 18.1: అర్జునుడు పలికెను : ఓ మహాబాహువులు కల కృష్ణా, 'సన్యాసము' (కర్మలను త్యజించటము) మరియు 'త్యాగము' (కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము) ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది, ఓ కేశినిషూదనా.

Commentary

అర్జునుడు శ్రీ కృష్ణుడిని ‘కేశి-నిషూదనా’ అని సంబోధించాడు, అంటే ‘కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా’ అని అర్థం. ఒక భయంకరమైన గుఱ్ఱం రూపంలో వచ్చి, వ్రజభూమిలో ఉత్పాతం సృష్టించిన, కేశి అనే రాక్షసుడిని, తన భూలోక దివ్య లీలలలో, శ్రీ కృష్ణుడు, సంహరించాడు. సంశయము అనేది కూడా మనస్సులో ఉరకలు వేస్తూ భక్తి అనే తోటను నాశనం చేసే ఒక అడవి గుఱ్ఱము లాంటిదే. అర్జునుడు ఇలా సూచిస్తున్నాడు, ‘ఏ విధంగా అయితే కేశి అనే రాక్షసుడిని సంహరించావో, దయచేసి నా మనస్సులో ఉన్న సంశయమును కూడా హరించివేయుము’ అని. అతని ప్రశ్న చాలా నిశితమైనది మరియు తీక్ష్ణమైనది. అతను సన్యాసము యొక్క స్వభావమును తెలుసుకోగోరుతున్నాడు, అంటే, ‘కర్మలను త్యజించటము’ అనే దాన్ని గురించి అన్నమాట. ఆయన ‘త్యాగము’ యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకోగోరుతున్నాడు, అంటే, ‘కర్మ ఫలములను భోగించాలనే కోరికను వదిలి వేయటం’ అన్నమాట. అంతేకాక, ‘పృథక్’ అన్న పదాన్ని కూడా వాడుతున్నాడు. అంటే ‘భేదము/తేడా’ అని అర్థం; అర్జునుడు ఈ రెండు పదముల అర్థం యొక్క తేడాని కూడా తెలుసుకోగోరుతున్నాడు. అర్జునుడు, శ్రీ కృష్ణుడిని హృషీకేశా అని కూడా సంబోధిస్తున్నాడు, అంటే ‘ఇంద్రియములకు అధిపతి’ అని అర్థం. అర్జునుడి లక్ష్యం ఏమిటంటే అత్యున్నత విజయం సాధించటమే, అదే మనో-ఇంద్రియములను నియంత్రణ లోనికి తెచ్చుకోవటం. ఈ విజయమే పరిపూర్ణ శాంతిని ప్రసాదించగలుగుతుంది. సర్వోన్నత భగవానుడైన శ్రీ కృష్ణ పరమాత్మ, ఇంద్రియములకు అధిపతిగా, తానే ఆ పరిపూర్ణ సిద్ధికి ఉదాహరణ.

ఈ విషయం ఇంతకు పూర్వం అధ్యాయములలో కూడా వివరించబడినది. శ్రీ కృష్ణుడు సన్యాసము గురించి 5.13వ మరియు 9.28వ శ్లోకాలలో మరియు త్యాగము గురించి 4.20వ మరియు 12.11వ శ్లోకాలలో వివరించియున్నాడు. కానీ ఇక్కడ ఈ విషయమును ఇంకొక కోణంలో నుండి వివరిస్తున్నాడు. ఒకే సత్యము, తాను చాలా దృక్కోణముల నుండి వివరింపబడటానికి, వెసులుబాటు ఇస్తుంది; మరియు ప్రతి ఒక్క కోణము తనదైన ప్రత్యేక వివరణను మనకు అందిస్తుంది. ఉదాహరణకు, ఒక పూదోట లోని వేర్వేరు ప్రదేశాలు, చూసేవారికి వేర్వేరు అనుభూతులను ఇస్తాయి, మరియు మొత్తంగా పూదోటను ఒకేమారు చూస్తే, అది మరియొక అనుభూతిని ఇస్తుంది. భగవద్గీత కూడా సరిగ్గా ఇలాంటిదే. ప్రతిఒక్క అధ్యాయము ఒక ప్రత్యేక యోగము గా చెప్పబడినది, అదే సమయంలో పద్దెనిమిదవ అధ్యాయము వీటన్నిటి సారాంశముగా పరిగణించబడుతుంది. ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, పూర్వపు పదిహేడు అధ్యాయములలో చెప్పబడిన నిత్యసనాతనమైన సూత్రములను మరియు శాశ్వత సత్యమును క్లుప్తముగా సంగ్రహించి చెప్పి, మరియు, వాటన్నిటి యొక్క క్రోడీకరించిన సంగ్రహమును ధృవీకరిస్తున్నాడు. సన్యాసము మరియు వైరాగ్యము అనే విషయములను వివరించిన పిదప, ఆయన త్రి-గుణముల యొక్క స్వభావమును మరియు అవి జనుల యొక్క స్వాభావిక ప్రవృత్తిని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తాడు. సత్త్వ గుణము మాత్రమే మనము పెంపొందించుకోవలసిన గుణము అని తిరిగి వక్కాణిస్తున్నాడు. భక్తి, అంటే, భగవంతుని పట్ల అనన్యమైన ప్రేమయుక్త అనురాగమే అత్యున్నత కర్తవ్యము అని, దానిని పొందటమే మానవ జీవనం యొక్క లక్ష్యము అని ముగిస్తున్నాడు.