న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ।। 10 ।।
న — కాదు; ద్వేష్టీ — ద్వేషము; అకుశలం — నచ్చనివి; కర్మ — పనులు; కుశలే — అనుకూలమైనవి/ఇష్టమైనవి; న అనుషజ్జతే — ఆశించకుండా ఉంటాడో; త్యాగీ — కర్మఫలములను భోగించాలనే వాంఛను విడిచిపెట్టినవాడు; సత్త్వ — సత్త్వ గుణము యందు; సమావిష్టః — సంపన్నుడైన; మేధావీ — తెలివికలవాడు; ఛిన్నసంశయః — ఎటువంటి సంశయములు లేని వారు.
Translation
BG 18.10: నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు (కర్మ స్వభావం గురించి).
Commentary
సత్త్వగుణ త్యాగములో ఉండేవారు, ప్రతికూల పరిస్థితులలో కృంగిపోరు లేదా అనుకూల పరిస్థితులయందు ఆసక్తితో ఉండరు. వారు, అన్ని పరిస్థితులలో, కేవలం తమ కర్తవ్యమును చేస్తూ పోతుంటారు; అంతా బాగున్నప్పుడు అత్యుత్సాహ పడరు, లేదా జీవన గమనం కష్టమైనప్పుడు నిరాశ చెందరు. వారు ఎండుటాకులా వీచే ప్రతి పిల్లగాలికి అక్కడిక్కడికి విసిరివేయబడరు. బదులుగా, వారు సముద్ర రెల్లు మొక్కల వంటివారు, వారి సమచిత్తత పోగొట్టుకోకుండా, క్రోధమునకు, దురాశకు, ఈర్ష్యకు, లేదా మమకారాసక్తికి వశపడకుండా, పడిలేచే ప్రతి అలతో అనుగుణముగా వ్యవహారమును కుదుర్చుకుంటారు. తమ చుట్టూ పడి లేచే పరిస్థితుల అలలకు సాక్షిగా నిలిచిపోతారు.
బాల గంగాధర తిలక్, ఒక భగవద్గీత పండితుడు మరియు ప్రఖ్యాత కర్మయోగి. మహాత్మా గాంధీ గారు రాకముందు, ఆయనే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ పదవి తీసుకుంటారు - ప్రధాన మంత్రా లేక విదేశీవ్యవహార మంత్రా? అని ఆయనను అడిగినప్పుడు, ‘నాకు, డిఫరేన్సియల్ కాల్‌క్యులస్, (Differential Calculus) పై ఒక పుస్తకం వ్రాయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. దానిని పూర్తిచేస్తాను.’ అని ఆయన అన్నాడు.
ఒకసారి, పోలీసులు ఆయనను అశాంతి కలుగచేసాడన్న నెపంపై అరెస్టు చేశారు. ఆయన తన స్నేహితుడిని, తనమీద ఏ అభియోగంపై అరెస్టు చేశారో కనుక్కోమన్నాడు. ఓ గంట సేపటి తరువాత ఆ స్నేహితుడు జైలుకు వెళ్తే అక్కడ తిలక్ జైల్లో హాయిగా నిద్రపోతున్నారు.
ఇంకొకసారి, ఆయన ఆఫీసులో పనిచేసుకుంటున్నప్పుడు, ఆయన పెద్దకొడుకు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు అని అక్కడి గుమాస్తా చెప్పాడు. ఆయన భావోద్వేగానికి లోను కాకుండా, గుమస్తాని ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పి, తన పనిలో నిమగ్నమైపోయాడు. ఓ అరగంట తరువాత, ఆయన స్నేహితుడు వచ్చి అదే వార్తను చెప్పాడు. అప్పుడాయన అన్నాడు, ‘వాడిని చూడటానికి వైద్యుడిని పిలిపించాను కదా, ఇంకేమి చేయాలి?’ అని. ఎంత తీవ్ర ఒత్తిడి పరిస్థితిలో ఉన్నా ఆయన తన మానసిక ప్రశాంతత ని ఎలా పదిలంగా ఉంచుకున్నాడో ఈ సంఘటనల వలన తెలుస్తున్నది. తన యొక్క అంతర్గత స్థిమితత్వం వలన ఆయన తన కార్యకలాపములను చేసుకోగలిగాడు; ఒకవేళ ఆయన భావోద్వేగానికి లోనయ్యి ఉంటే ఆయన జైలులో నిద్రపోయి ఉండేవాడే కాదు లేదా కార్యాలయంలో తన పని మీద ఏకాగ్రతను నిలుపుకునేవాడే కాదు.