Bhagavad Gita: Chapter 18, Verse 14

అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ।। 14 ।।

అధిష్ఠానం — దేహము; తథా — మరియు; కర్తా — కర్త/చేయునది (జీవాత్మ); కరణం — ఇంద్రియములు; చ — మరియు; పృథక్-విధమ్ — వేర్వేరు రకాల; వివిధాః — చాలా; చ — మరియు; పృథక్ — భిన్నమైన; చేష్టా — ప్రయత్నములు; దైవం — దైవానుగ్రహము; చ ఏవ అత్ర — ఇవి ఖచ్చితముగా (కారణములు); పంచమమ్ — ఐదు.

Translation

BG 18.14: శరీరము, కర్త (జీవాత్మ), వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము - ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.

Commentary

ఈ శ్లోకంలో అధిష్టానం అంటే, ‘నివసించే స్థానము’ అని, అంటే శరీరము అన్నమాట, ఆత్మ శరీరములో ఉన్నపుడే కర్మలు చేయటానికి సాధ్యమవుతుంది. 'కర్తా' అంటే 'చేసేవాడు', అంటే 'జీవాత్మ' అన్నమాట. ఆత్మ తనంతట తానే కర్మలు చేయకపోయినా, అది శరీర-మనో-బుద్ధుల వ్యవస్థను జీవప్రాణముతో కర్మలు చేయటానికి ఉత్తేజింపచేస్తుంది. అంతేకాక, అహంకార ప్రభావం వల్ల, ఆ కర్మలు చేసేది తానే, అని అనుకుంటుంది. అందుకే, శరీరముచే చేయబడిన పనులకు అది బాధ్యత వహించవలసి ఉంటుంది, మరియు ఆత్మ 'తెలిసినవాడు' మరియు 'చేసేవాడు' అని పరిగణించబడుతుంది. ప్రశ్నోపనిషత్తు ఇలా పేర్కొంటుంది: :

ఏష హి ద్రష్టా స్ప్రష్టా శ్రోతా ఘ్రాతా రసయితా మంతా బోద్ధా

కర్తా విజ్ఞానాత్మా పురుషః స పరే ఽక్షర ఆత్మని సంప్రతిష్ఠతే (4.9)

‘చూసేది, స్పర్శించేది, వినేది, అనుభవించేది, రుచి చూసేది, ఆలోచించేది, మరియు అర్థంచేసుకునేది - ఆత్మయే. అందుకే ఆత్మను, కర్మలను 'తెలిసినది' మరియు 'చేసేది' అని పరిగణించాలి.’ బ్రహ్మ సూత్రములు కూడా ఇలా పేర్కొంటాయి: జ్ఞో ఽత ఏవ (2.3.18) ‘యథార్థంగా ఆత్మయే జ్ఞాత’. మరల, బ్రహ్మ సూత్రములు ఇలా పేర్కొంటున్నాయి: కర్తా శాస్త్రార్థవత్త్వాత్ ‘ఆత్మయే అన్ని పనులను చేసేది, ఇది శాస్త్రములలో ధృవీకరించబడింది.’ ఈ పై వాక్యముల ద్వారా మనకు, కర్మలు చేయటంలో, జీవాత్మ కూడా ఒక భాగమే అని స్పష్టమవుతున్నది.

కర్మలు చేయటంలో ఇంద్రియములు ఉపకరణములలా సహకరిస్తాయి. ఇంద్రియములు లేకుండా, ఆత్మ - రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దము వంటి వాటిని అనుభవించలేదు. వీటితోపాటుగా, ఐదు కర్మేంద్రియములు కూడా ఉన్నాయి - చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియములు, మరియు గుదము. వీటన్నిటి సహకారంతోటే ఆత్మ వివిధ రకాల పనులను చేస్తుంటుంది. అందుకే, కార్యములను సాధించటానికి ఇంద్రియములు కూడా కారకములగా పేర్కొనబడ్డాయి.

కర్మ కొరకు అన్నీ ఉపకరణములు ఉన్నా, వ్యక్తి తన ప్రయత్నం చేయకపోతే, ఏ పనీ అవ్వదు. నిజానికి, మన పరిశ్రమ/ప్రయత్నం ఎంత ముఖ్యమైనది అంటే, చాణక్య పండితుడు తన నీతి సూత్రములలో ఇలా పేర్కొన్నాడు : ఉత్సాహవతాం శత్రవోపి వశీభవంతి, ‘తగినంత పరిశ్రమతో దుర్భాగ్యమును కూడా గొప్ప అదృష్టముగా మార్చుకోవచ్చు.’ నిరుత్వాహాద్ దైవం పతిత, ‘తగినంత పరిశ్రమ లేకపోతే మంచి అదృష్టము కూడా దురదృష్టముగా మారిపోవచ్చు.’ కాబట్టి, చేష్టా (పరిశ్రమ) అనేది కర్మ యొక్క మరియొక అంగము.

భగవంతుడు ప్రాణుల శరీరములో సాక్షిగా స్థితమై ఉంటాడు. వాటి వాటి పూర్వ కర్మానుసారం, వివిధ జనులకు కర్మలు చేయటానికి భిన్నభిన్న సామర్థ్యములను ఇస్తుంటాడు. దీనినే మనము దైవానుగ్రహము అనవచ్చు. ఉదాహరణకు, కొందరికి గొప్ప ఐశ్వర్యము, డబ్బు సంపాదించే శక్తి/తెలివి ఉండవచ్చు. వారి యొక్క, జటిలమైన పరిస్థితుల యొక్క ఆర్థిక విశ్లేషణ శక్తిని చూసి వారి స్నేహితులు/సహోద్యోగులు చాలా ఆశ్చర్యపడవచ్చు. వారు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు అన్నీ వారికి అనుకూలంగానే రావచ్చు. ఈ యొక్క విశేషమైన తెలివి, వారికి భగవంతుడు ఇచ్చినదే. అదేవిధముగా, మరికొందరికి, భగవత్ ప్రసాదితమైన ప్రతిభ క్రీడల్లో, సంగీతంలో, లలితకళలలో, రచనల్లో.. మొదలైన వాటిలో ఉండవచ్చు. భగవంతుడే వీరందరికీ విశేష ప్రతిభ, సామర్థ్యములను వారివారి పూర్వ కర్మానుసారం ప్రసాదిస్తాడు. ప్రస్తుత కర్మల ఫలితములను కూడా ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి, భగవంతుడు కూడా కర్మ యొక్క అంగములలో ఒకటిగా పేర్కొనబడ్డాడు.