Bhagavad Gita: Chapter 18, Verse 15-16

శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ।। 15 ।।
తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః ।
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। 16 ।।

శరీర-వాక్-మనోభిః — శరీరము, వాక్కు, లేదా మనస్సు; యత్ — ఏదయితే; కర్మ — పని; ప్రారభతే — చేస్తారో; నరః — వ్యక్తి; న్యాయ్యం — సరియైన (మంచిపని); వా — లేదా; విపరీతం — సరికానిది అయినా (చెడుపని); వా — లేదా; పంచ — ఐదు; ఏతే — ఇవి; తస్య — వాటి; హేతవః — హేతువులు; తత్త్ర — అక్కడ; ఏవం సతి — అయినా సరే; కర్తారమ్ — చేసేది; ఆత్మానం — ఆత్మ; కేవలం — కేవలము; తు — కానీ; యః — ఎవరైతే; పశ్యతి — చూస్తారో; అకృత-బుద్ధిత్వాత్ — మలినమైన బుద్ధితో; న స పశ్యతి — వారు చూడనట్టు; దుర్మతి: — మూర్ఖులు.

Translation

BG 18.15-16: శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు.

Commentary

మూడు రకములైన కర్మలు ఏమిటంటే - కాయిక (శరీరముచే చేయబడినవి), వాచిక (వాక్కు/మాటలచే చేయబడినవి), మరియు మానసిక (మనస్సుచే చేయబడినవి). వీటిలో ప్రతిఒక్క వర్గంలో కూడా, పుణ్య కర్మలు చేసినా లేదా పాప కర్మలు చేసినా, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడిన ఐదు కారకములే బాధ్యులు. అహంకారము చేత మనమే ఈ పనులు చేసేది అనుకుంటాము. ‘నేనే ఇది చేసాను.’, ‘నేనే అది సాధించాను’, ‘నేను ఇది చేస్తాను’, ఇటువంటి మాటలు మనమే కర్త అన్న భ్రమలో అంటాము. ఈ జ్ఞాన విషయం తెలియచేయటంలో శ్రీ కృష్ణుడి ఉద్దేశం ఏమిటంటే, ఆత్మ యొక్క కర్తృత్వ-అహంకారమును నాశనం చేయటమే. ఈ విధంగా, కేవలం ఆత్మ మాత్రమే కర్మలను చేసేది అని అనుకునేవారు యదార్థమును చూడలేనట్టే. ఒకవేళ భగవంతుడు ఆత్మకు శరీరమును ఇవ్వకపోతే, అది ఏమీ చేసి ఉండగలిగేది కాదు. అంతేకాక, భగవంతుడు శరీరమును ప్రాణముతో శక్తివంతము చేయకపోతే, అది కూడా ఏమి చేసి ఉండగలిగేది కాదు. కేనోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే (1.4)

‘వాక్కుచే బ్రహ్మన్ వర్ణింపబడలేడు. దాని (బ్రహ్మం) ప్రేరణచేతనే, స్వరమునకు మాట్లాడే శక్తి వస్తుంది.’

యన్మనసా న మనుతే యేనాహుర్మనో మతం (1.5)

‘మనోబుద్ధులచే బ్రహ్మన్ అర్థం చేసుకోబడలేడు. దాని (బ్రహ్మం) శక్తి చేతనే, మనోబుద్ధులు పనిచేస్తాయి’

యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంశి పశ్యతి (1.6)

‘కళ్ళతో బ్రహ్మన్ చూడబడలేదు. దాని (బ్రహ్మం) ప్రేరణ చేతనే, కళ్ళు చూడగలుగుతాయి.’

యచ్ఛ్రోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్ (1.7)

‘చెవులకు బ్రహ్మన్ వినపడదు. దాని (బ్రహ్మం) శక్తి చేతనే చెవులు వింటాయి.’

యత్ ప్రాణేన న ప్రణితి యేన ప్రాణః ప్రణీయతే (1.8)

‘ప్రాణ-వాయువులచే బ్రహ్మము ప్రేరేపింపబడలేదు. దాని ప్రేరణ చేతనే, ప్రాణవాయువులు పనిచేస్తాయి.’

అంటే, కర్మలు చేయటంలో జీవాత్మకు ప్రమేయం లేదు అని అర్థం కాదు. అది కారులో డ్రైవర్ లాంటిది, అది స్టీరింగ్ చక్రమును తిప్పుతూ, ఎక్కడ పక్కకి తిప్పాలి, ఎంత వేగంతో నడపాలి అని నిర్ణయిస్తుంది. అదే విధముగా, ఆత్మ కూడా శరీరమనోబుద్ధులను నియంత్రిస్తుంది, కానీ చేనేది తానే అన్న భావమును అది కలిగి ఉండరాదు. ఒకవేళ మనమే, కర్మకు ఉన్న ఒకేఒక కారణం అనుకుంటే, మనమే ఆ కర్మల ప్రతిఫలమును అనుభవించాలి అని అనుకుంటాము. కానీ, కర్తృత్వ భావన (చేసేది నేనే భావన) ను నిర్మూలించుకుని, ఇదంతా భగవంతుని కృప వలెనే, ఆయన ఇచ్చిన ఉపకరణముల వలననే సాధ్యమయినది అని భావిస్తే, మనము మన కర్మ ఫలములకు భోక్తలముకాము అని మరియు అన్ని పనులు ఆయన ప్రీతికోసమే ఉన్నాయని తెలుసుకుంటాము. తదుపరి శ్లోకంలో వివరించబడినట్టు, మనం చేసే ప్రతి యజ్ఞము, దానము, మరియు తపస్సు ఆయనకే సమర్పించటానికి మరియు వాటిని భక్తితో చేయటానికి, ఈ జ్ఞానము ఎంతగానో తొడ్పడుతుంది.