Bhagavad Gita: Chapter 18, Verse 20

సర్వ భూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం ।। 20 ।।

సర్వ-భూతేషు — సమస్త ప్రాణుల యందు; యేన — దేనిచేతనైతే; ఏకం — ఒక్కటే; భావం — స్వభావము; అవ్యయమ్ — అనశ్వరమైన; ఈక్షతే — చూడవచ్చు; అవిభక్తం — అవిభక్తమైన; విభక్తేషు — భిన్నత్వములో; తత్ — అది; జ్ఞానం — జ్ఞానము; విద్ధి — అర్థం చేసుకొనుము; సాత్త్వికం — సత్త్వగుణములో ఉన్నట్టు.

Translation

BG 18.20: ఏ జ్ఞానముచేతనైతే, సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన అస్తిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానము సత్త్వ గుణములో ఉన్నట్టు.

Commentary

ఈ సృష్టి, మనకు విభిన్నమైన రకరకాల జీవరాశుల, భౌతిక వస్తువుల సమూహముగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మొత్తం కనిపించే భిన్నత్వానికి వెనుక ఉన్నపదార్థము ఆ పరమేశ్వరుడే. ఎలాగైతే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, అన్ని విద్యుత్ ఉపకరణములలో ప్రవహించేది ఒకే విద్యుత్తు అని ఎట్లా గమనిస్తాడో; ఒక కంసాలి, అన్ని ఆభరణములలో ఉండేది ఒకే బంగారము అని ఎలాగైతే గమనిస్తాడో, ఈ జ్ఞాన దృష్టి కలవారు ఈ సృష్టిలో ఉన్న భిన్నత్వం వెనుక ఏకత్వమును చూస్తారు. శ్రీమద్ భాగవతం ప్రకారం,

వదంతి తత్ తత్త్వ-విదస్ తత్త్వం యజ్ జ్ఞానం అద్వయం (1.2.11)

‘రెండవది లేకుండా, ఉన్నది అంతా ఒక్కటే అని, సత్యమును ఎఱింగిన వారు పేర్కొన్నారు.’ చైతన్య మహాప్రభు, ఈ క్రింది నాలుగు సూత్రముల ఆధారముగా, భగవంతుడిని శ్రీ కృష్ణ రూపములో, అద్వయ జ్ఞాన తత్త్వముగా పరిగణించాడు, (అంటే, రెండవది ఏదీ లేక ఉన్నది ఒకటే, సృష్టిలో ఉన్న ఒకేఒకటి మరియు సమస్తము అదే, అని).

1. సజాతీయ భేద శూన్యము. (సజాతీయమైన వాటికంటే వెరైనది కాదు): రాముడు, శివుడు, విష్ణువు వంటి వేరే ఇతర అన్ని భగవత్ స్వరూపములకు శ్రీ క్రిష్ణుడు అభేదము. ఎందుకంటే వీరందరూ ఒకే భగవంతుని యొక్క భిన్నమైన వ్యక్తములు.

శ్రీ కృష్ణుడు, ఆత్మలకు కూడా అభేదమే, అవి ఆయన యొక్క అణు-అంశములే. ఎలాగైతే అగ్ని జ్వాలలు, అగ్ని యొక్క చిన్న భాగాలో, అంశము అనేది దాని యొక్క పరిపూర్ణ భాగమునకు అభేదము.

2. విజాతీయ భేద శూన్యము. (విజాతీయమైన వాటి కంటే భేదము లేని వాడు):

భగవంతునికి విజాతీయమైనది మాయ; అది జడమైనది, భగవంతుడు చైతన్యవంతుడు. కానీ, మాయ కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే, ఎలాగైతే అగ్ని యొక్క శక్తులైన వేడిమి-వెలుగు, దానికంటే అభేదమో, శక్తి మరియు శక్తిమంతుడు కూడా అభేదములే.

3. స్వగత భేద శూన్యము (తనయొక్క వేర్వేరు అంగములు ఆయనకు అభేదము): భగవంతుని శరీరము యొక్క మహాద్భుతమైన లక్షణము ఏమిటంటే, దానిలో అన్ని అంగములు మిగతా అన్ని అంగముల పని చేస్తాయి. బ్రహ్మ సంహిత ఇలా పేర్కొంటున్నది:

అంగాని యస్య సకలేంద్రియ-వృత్తి-మంతి

పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి (5.32)

‘తన శరీరము యొక్క అన్ని అంగములతో భగవంతుడు చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, వాసన చూడగలడు, తినగలడు, మరియు ఆలోచించగలడు. అందుకే భగవంతుని యొక్క అన్ని అంగములు ఆయనకు అభేదములే.

4. స్వయం సిద్ధము. (తనకు వేరే ఏ ఇతరమైన వాటి ఆధారము అవసరం లేదు): మాయ మరియు ఆత్మ రెండూ కూడా తమ అస్తిత్వం కోసం భగవంతుని పైనే ఆధారపడి ఉన్నాయి. ఆయనే గనక ఆయన వాటిని శక్తివంతము చేయకపోతే, వాటికి అస్తిత్వం లేదు (వాటికి మనుగడ లేదు). అదే సమయంలో, భగవంతుడు సర్వ స్వతంత్రుడు మరియు తన మనుగడ కోసం ఏ ఇతరమైన వాటి ఆధారం ఆయనకు అవసరం లేదు.

సర్వోన్నతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ఈ పై నాలుగు లక్షణములను కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అద్వయ జ్ఞాన తత్త్వము; వేరే మాటల్లో చెప్పాలంటే, సృష్టిలో ఉండే ప్రతీదీ ఆయనే. ఈ అవగాహనతో, సమస్త సృష్టిని ఆయనతో ఏకత్వముతో చూస్తే, అది సాత్త్విక జ్ఞానమవుతుంది. మరియు ఈ జ్ఞానంతో ఉన్న ప్రేమ, జాతికీ దేశానికీ అతీతమైన విశ్వప్రేమ.