Bhagavad Gita: Chapter 18, Verse 30

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ।। 30 ।।

ప్రవృత్తిం — కార్యకలాపాలు; చ — మరియు; నివృత్తిం — కార్యకలాపాలు విడిచిపెట్టటం; చ — మరియు; కార్య — చేయవలసిన విహిత కర్మలు; అకార్యే — నిషిద్ధ కర్మలు; భయ — భయము; అభయే — నిర్భయంగా; బంధం — బంధ కారకము; మోక్షం — మోక్ష దాయకము; చ — మరియు; యా — ఏదైతే; వేత్తి — అర్థంచేసుకున్న; బుద్ధిః — బుద్ధి; సా — అది; పార్థ — ప్రిథ పుత్రుడా; సాత్త్వికీ — సత్త్వ గుణములో ఉన్నట్టు.

Translation

BG 18.30: ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు, బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును.

Commentary

మనం నిరంతరం మన స్వేచ్ఛా చిత్తమును ఉపయోగించుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము, మరియు మన ఈ నిర్ణయముల ఎంపికే, మనం జీవితంలో ఎటువెళతామో నిర్ణయిస్తుంది. రాబర్ట్ ఫ్రాస్ట్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తన కవిత ‘ది రోడ్ నాట్ టేకెన్’ ('The Road Not Taken') లో వివరించాడు.

I shall be telling this with a sigh
Somewhere ages and ages hence;
Two roads diverged in a wood, and I,
I took the one less traveled by,
And that has made all the difference.

సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఒక అభివృద్ధి చెందిన ఉన్నతమైన విచక్షణా సామర్థ్యము అవసరం. అర్జునుడికి సరైన విచక్షణా జ్ఞానమును అందించటానికే, భగవద్గీత అతనికి ఉపదేశించబడినది. మొదట్లో, అర్జునుడు తన కర్తవ్యము పట్ల అయోమయంలో ఉన్నాడు. తన బంధువుల పట్ల విపరీతమైన మమకారాసక్తి అతనిని ఏది సరైన పనో ఏది కాదో అన్న నిర్ణయంపట్ల అయోమయానికి గురి చేసింది. బలహీనంతో మరియు భయంతో, తీవ్ర అయోమయంలో, ఆయన భగవంతునికి శరణాగతి చేసి మరియు ఆయనను తన కర్తవ్యం పట్ల జ్ఞానోపదేశం చేయమని వేడుకున్నాడు. ఈ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి విచక్షణా జ్ఞానమును పెంపొందించుకోవటానికి దోహదపడ్డాడు, చిట్ట చివరికి ఇలా ముగించాడు: ‘నేను నీకు పరమ రహస్యాలలోకే రహస్యమైన ఈ జ్ఞానముని వివరించాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు ఇష్టమైనరీతిలో చేయుము.’ (18.63వ శ్లోకం).

సత్త్వ గుణము, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేస్తుంది, అది, వస్తువులు, పనులు, మరియు భావాలలో, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే విచక్షణని పెంపొందింప చేస్తుంది. ఏ రకమైన పని (కర్మ) చేయాలి, ఏ రకమైన పని విడిచిపెట్టాలి; దేనికి భయపడాలి, దేనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు - అన్న జ్ఞానాన్ని మనకు సత్త్వ గుణ బుద్ధిః ఎఱుకలోకి తెస్తుంది. అది మన వ్యక్తిత్వములోని లోపాల యొక్క కారణాన్ని మరియు వాటికి పరిష్కారాన్ని తెలియచేస్తుంది.