Bhagavad Gita: Chapter 18, Verse 37

యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ ।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ।। 37 ।।

యత్ — ఏదైతే; తత్ — అది; అగ్రే — ప్రారంభంలో; విషం-ఇవ — విషములా; పరిణామే — చివరికి; అమృత-ఉపమమ్ — అమృతము వలె; తత్-సుఖం — అటువంటి సుఖము; సాత్త్వికం — సాత్త్వికమని; ప్రోక్తమ్ — చెప్పబడినది; ఆత్మ-బుద్ధి — ఆత్మ జ్ఞానం లో స్థితమై; ప్రసాద-జమ్ — శుద్ధమైన బుద్ధిచే జనింపచేయబడిన.

Translation

BG 18.37: మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.

Commentary

భారతదేశ ఉసిరికాయ (ఆమ్లా) ఆరోగ్యానికి లాభకారియైన అత్యుత్తమ ఆహారపదార్థములలో ఒకటి. దానిలో 10 నారింజ పళ్ళకన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ, పిల్లలకు అది ఇష్టం ఉండదు, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది. ఉత్తర భారత దేశంలో, తల్లిదండ్రులు తమ పిల్లలను దాన్ని తినమని ప్రోత్సహిస్తూ ఇలా అంటారు: ఆమ్లే కా ఖాయా ఔర్ బడోం కా కహా, బాద్ మే పతా చల్తా హై, అంటే ‘ఉసిరికాయ (ఆమ్లా) తినటం మరియు పెద్దల సలహా - ఈ రెండింటి ప్రయోజనం భవిష్యత్తులో తెలుస్తుంది’ అని. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఉసిరికాయ తిన్నతరువాత, రెండు నిమిషాల వ్యవధిలోనే, పుల్లని రుచి పోయి, తియ్యని రుచి అనుభవంలోకి వస్తుంది. అంతేకాక, సహజమైన విటమిన్ సి తీసుకోవటంలో నిస్సందేహముగా అనేక దీర్ఘకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పై శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, సత్త్వ గుణ సుఖము సరిగ్గా ఇటువంటిదే అని; అది ప్రస్తుతానికి చేదుగా అనిపించినా, అంతిమంగా అమృతంలాగా ఉంటుంది.

వేదములు ఈ యొక్క సత్త్వ గుణ సుఖాన్ని 'శ్రేయస్సు' అని చెప్పాయి, అంటే ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్నా, అంతిమంగా అది చాలా మంచిది. దీనికి వ్యతిరేకం 'ప్రేయస్సు', అది ప్రస్తుతానికి సుఖంగా ఉన్నా, అంతిమంగా హానికారకమే. ఈ శ్రేయస్సు మరియు ప్రేయస్సు గురించి, కఠోపనిషత్తు ఈ విధంగా పేర్కొన్నది:

అన్యఛ్చ్రెయో ఽన్యదుతైవ ప్రేయస్తే

ఉభే నానార్థే పురుషం సినీతః

తయో శ్రేయః ఆదదానస్య సాధు భవతి

హీయతేఽర్థాద్య ఉప్రేయోవృణీతే

శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ

సంపరీత్య వివినక్తి ధీరః

శ్రేయో హి ధీరోఽభిప్రేయసో వృణీతే

ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే (1.2.1-2)

‘రెండు మార్గాలు ఉన్నాయి - ఒకటి “మేలుకలిగించేది” ఇంకొకటి “సుఖంగా” ఉండేది. ఈ రెండూ మనుష్యులను రెండు భిన్నమైన గమ్యాలకు చేరుస్తాయి. సుఖంగా ఉండేది మొదట్లో హాయిగా అనిపిస్తుంది, కానీ, అది బాధతో ముగుస్తుంది. అజ్ఞానులు ఈ సుఖాలలో చిక్కుకుపోతారు మరియు చివరకు నశించిపోతారు. కానీ, వివేకవంతులు ఈ ఆకర్షణలచే మోసపోరు; అందుకే, వారు ప్రయోజనకరమైనదాన్ని ఎంచుకుంటారు మరియు సుఖానందాన్ని పొందుతారు.’