అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః ।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ।। 49 ।।
అసక్త-బుద్ధిః — ఎవరి బుద్ధి అయితే ఆసక్తిరహితంగా ఉంటుందో; సర్వత్ర — అంతటా; జిత-ఆత్మా — మనస్సుని అధీనములోనికి తెచ్చారో; విగత-స్పృహః — కోరికలు లేకుండా; నైష్కర్మ్య-సిద్ధిం — కర్మరహిత స్థితి; పరమాం — అత్యున్నతమైన; సన్న్యాసేన — సన్యాస అభ్యాసముచే; అధిగచ్ఛతి — పొందుతారు.
Translation
BG 18.49: ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
Commentary
ఈ చివరి అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితమే చెప్పిన ఎన్నో సూత్రాలను మరోసారి చెప్తాడు. ఈ అధ్యాయం మొదట్లో, కేవలం జీవిత బాధ్యతల నుండి పారిపోవటం సన్న్యాసము కాదు, అది త్యాగము కూడా కాదు, అని అర్జునుడికి చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ రహిత స్థితి, అంటే, నైష్కర్మ్య-సిద్ధి స్థితిని వివరిస్తున్నాడు. ప్రపంచం యొక్క నిరంతరం మారుతున్న స్థితి గతుల మధ్యకూడా, మనలను మనమే ప్రపంచ సంఘటనలు, పరిణామాలకు దూరంగా, ఆసక్తి రహితముగా ఉంచుకొని, కేవలం మన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే ధ్యాస ఉంచట ద్వారా, ఈ నైష్కర్మ్య -సిద్ధి స్థితిని, సాధించవచ్చు. ఇది ఎలాగంటే, ఒక వంతెన క్రింది నుండి నీరు ఒకవైపునుండి వచ్చి ఇంకొక వైపు నుండి వెళ్ళిపోవటం లాంటిది. ఆ వంతెన ఆ నీటిని తీసుకోదు లేదా నీటిని సరఫరా చేయదు; ఆ నీటి ప్రవాహంచే ఏమాత్రం ప్రభావితం కాదు. అదే విధంగా, కర్మయోగులు తమ కర్తవ్యాన్ని చేస్తుంటారు, కానీ నిరంతరం జరిగే పరిణామాల పట్ల ఉదాసీనంగా ఉంటారు. భగవత్ ఆరాధన లాగా, వారు తమ కర్తవ్య నిర్వహణలో చక్కటి పరిశ్రమ చేస్తారు, కానీ అంతిమ ఫలితాన్ని ఆ భగవంతునికే వదిలేస్తారు, తద్వారా వారు ఎల్లప్పుడూ తృప్తితో మరియు ఏది జరిగినా ప్రశాంతంగానే ఉంటారు. దీనిని వివరించటానికి ఒక చక్కటి కథ ఉంది.
ఒకాయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు; మొదటమ్మాయికి ఒక రైతుతో వివాహమయ్యింది మరియు రెండవ అమ్మాయికి ఒక ఇటుకబట్టి యజమానితో వివాహమయ్యింది. ఒకరోజు, ఆ తండ్రి మొదటమ్మాయికి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కున్నాడు. ఆమె అన్నది, ‘నాన్నా, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. మంచి వర్షాలు పడాలని మాకోసం దేవుణ్ణి ప్రార్థించు.’ అని. ఆయన తరువాత రెండవ అమ్మాయికి ఫోన్ చేసాడు, ఆమె అన్నది ‘నాన్నా, మాకు డబ్బులు అయిపోతున్నాయి, ఈ సంవత్సరం వానలు పడొద్దని దయచేసి దేవుణ్ణి ప్రార్థించు, బాగా ఎండ కాస్తే, మాకు మంచి ఇటుకల ఉత్పత్తి జరుగుతుంది.’ అని. తండ్రి తన కూతుర్ల నుండి విరుద్ధమైన విన్నపాలు విన్నాడు మరియు ఇలా అనుకున్నాడు, ‘ఆ భగవంతునికే తెలుసు ఏది మంచిదో, ఏది సరియైనదో, ఆయననే చేయనీ." అని. ఈశ్వర సంకల్పానికి ఇటువంటి శరణాగతి అనేది, ప్రపంచంలో నిరంతరం జరిగే వ్యవహారములలో తలమునకలై ఉన్నాసరే, వాటివాటి ఫలితములపట్ల అనాసక్తిని కలుగచేస్తుంది.