Bhagavad Gita: Chapter 18, Verse 56

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః ।
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ।। 56 ।।

సర్వ — సమస్త; కర్మాణి — పనులు; అపి — కూడా; సదా — ఎల్లపుడూ; కుర్వాణః — నిర్వర్తిస్తూ; మత్-వ్యపాశ్రయః — నన్నే పూర్తిగా ఆశ్రయించి; మత్ ప్రసాదాత్ — నా కృప చే; అవాప్నోతి — పొందుతారు; శాశ్వతం — నిత్యమైన; పదమ్ — ధామము; అవ్యయమ్ — అనశ్వరమైన.

Translation

BG 18.56: సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.

Commentary

భక్తి ద్వారా భక్తులు తన యొక్క సంపూర్ణ ఏకీభావ స్థితిలోకి వస్తారని ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పియున్నాడు. ఈ దృక్పథంలో, వారు ప్రతిదాన్నీ ఈశ్వర సంబంధముగా చూస్తారు. తమ శరీర, మనోబుద్ధులను భగవంతుని శక్తిగా పరిగణిస్తారు; వారి భౌతిక సంపత్తిని భగవంతుని సొత్తుగా చూస్తారు; వారు సర్వ భూతములను భగవంతుని అంశములుగానే పరిగణిస్తారు; మరియు తమనితాము భగవత్ సేవకులుగా పరిగణించుకుంటారు. ఆ దివ్య దృక్పథంలో, వారు పనిని విడిచిపెట్టరు, కానీ కర్తృత్వ భావనను మరియు కర్మఫలభోక్తలమనే భావనను విడిచిపెడతారు. అన్ని పనులను ఈశ్వర సేవగా చూస్తారు మరియు వాటిని చేయటానికి ఆయన మీదనే ఆధారపడుతారు.

ఆ తర్వాత, దేహమును విడిచిపెట్టిన పిదప, భగవంతుని దివ్య ధామమును చేరుకుంటారు. ఏ విధంగానైతే ఈ భౌతిక జగత్తు భౌతిక శక్తితో తయారు చేయబడినదో, దివ్య లోకాలు ఆధ్యాత్మిక దివ్య శక్తిచే తయారుచేయబడినవి. కాబట్టి, అది భౌతిక స్వభావం యొక్క దోషములకు అతీతమయినది మరియు సంపూర్ణ దోషరహితమైనది. అది సత్-చిత్-ఆనందం, అంటే నిత్యశాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందములచే నిండి ఉన్నది. తన దివ్య ధామము గురించి, శ్రీ కృష్ణుడు 15.6వ శ్లోకం లో చెప్పి ఉన్నాడు. ‘సూర్యుడు కానీ, చంద్రుకు కానీ, అగ్ని కానీ - నా సర్వోత్కృష్ట పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన తరువాత, జీవులు, మరల ఈ భౌతిక జగత్తుకు తిరిగి రారు.’

భగవంతుని యొక్క వివిధమైన స్వరూపాలకు, ఆధ్యాత్మిక జగత్తులో వారి వారి స్వీయ ధామములు ఉన్నాయి; అక్కడ వారు తమ భక్తులతో నిత్య ప్రేమయుక్త లీలలలో నిమగ్నమై ఉంటారు. ఎవరైతే ఆయన పట్ల నిస్వార్థ ప్రేమయుక్త భక్తి సేవలో పరిపూర్ణత సాధిస్తారో వారు ఆయొక్క ఆరాధించిన భగవత్ స్వరూప ధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా, శ్రీ కృష్ణుడి భక్తులు గోలోకమునకు, విష్ణుభక్తులు వైకుంఠమునకు, రామ భక్తులు సాకేతలోకమునకు, శివ భక్తులు శివలోకమునకు, దుర్గామాత భక్తులు దేవీలోకమునకు చేరుకుంటారు. ఈ దివ్య ధామములకు చేరుకున్న భక్తులు, ఆయనను చేరిన తరువాత, ఆధ్యాత్మిక శక్తితో పరిపూర్ణమైన ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటారు.