చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః ।
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ।। 57 ।।
చేతసా — అంతఃకరణచే; సర్వ-కర్మాణి — సమస్త కర్మలను; మయి — నాకు; సన్న్యస్య — సమర్పిస్తూ; మత్పరః — నన్నే పరమ లక్ష్యముగా చేసుకుని; బుద్ధి-యోగం — బుద్ధిని భగవంతునితో ఏకం చేసి; ఉపాశ్రిత్య — ఆశ్రయించి; మత్-చిత్తః — చిత్తమును నా యందే లగ్నం చేసి; సతతం — ఎల్లప్పుడూ; భవ — ఉండుము.
Translation
BG 18.57: నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము.
Commentary
‘యోగము’ అంటే ఏకమైపోవుట, మరియు బుద్ధి యోగము అంటే, ‘బుద్ధిని భగవంతునితో ఏకం చేయుట’ అని. సమస్త పదార్థములూ, జీవులూ భగవంతుని నుండే జనించాయి, ఆయనతో అనుసంధానమై ఉన్నాయి, మరియు ఆయన ప్రీతికోసమే ఉన్నాయి - అని ఎప్పుడైతే బుద్ధి దృఢ నిశ్చయంతో ఉంటుందో, అప్పుడు బుద్ధి భగవంతునితో ఏకమై పోతుంది. మనలో ఉన్న అంతర్గత వ్యవస్థలో బుద్ధి యొక్క స్థాయిని ఒకసారి అర్థం చేసుకుందాము.
మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంటుంది, మనం దానినే సామాన్యంగా 'హృదయము' అంటుంటాము. దానికి నాలుగు అస్తిత్వాలు ఉంటాయి. అది ఆలోచనలను సృష్టిస్తే, దానిని మనం 'మనస్సు' అంటాము. అది విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటే దానిని 'బుద్ధి' అంటాము. అది ఒక వస్తువుకు లేదా వ్యక్తికి పట్ల మమకారానురాగంతో ఉంటే దానిని 'చిత్తము' అంటాము. అది తనను తాను దేహసంబంధ గుణములతో అనుసంధానం చేసుకుని మరియు గర్వంతో ఉంటే, దానిని మనం 'అహంకారము' అంటాము.
ఈ యొక్క అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయి ఉన్నతమైనది. అది నిర్ణయం తీసుకుంటే, మనస్సు ఆ నిర్ణయాల ప్రకారం తన కోరికలను కోరుతుంది, మరియు చిత్తము ఆయా వస్తువిషయముల పట్ల మమకారాసక్తితో ఉంటుంది. ఉదాహరణకి, బుద్ధి గనక మనకు సెక్యూరిటీ (భద్రత) యే చాలా ప్రధానమైనది అని నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ జీవితంలో సెక్యూరిటీ (భద్రత) కోసమే ప్రాకులాడుతుంది. హోదా/ప్రతిష్ఠలే జీవితంలో ఆనందానికి మూలం అని గనక బుద్ధి నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ ‘ప్రతిష్ఠ.., ప్రతిష్ఠ..., ప్రతిష్ఠ..’ అని ప్రాకులాడుతుంది.
రోజంతా, మనం మనుష్యులం మనస్సుని బుద్ధిచే నియంత్రిస్తుంటాము. అందుకే, క్రోధమనేది క్రిందివారి పట్లే ప్రదర్శించబడుతుంది. సీ.ఈ.ఓ. గారు డైరెక్టర్ ని అరుస్తాడు. ఆ డైరెక్టర్ తిరిగి సీ.ఈ.ఓ. పై అరవడు, ఎందుకంటే అలా చేస్తే ఉద్యోగం పోతుందని ఆయన బుద్ధి తెలుసుకుంటుంది. ఆయన తన కోపాన్ని మేనేజర్ మీద చూపిస్తాడు. డైరెక్టర్ ఎంత చికాకు పెట్టినా, మేనేజర్ తనను తాను కంట్రోల్ చేసుకుని, తన చికాకుని ఫోర్మన్ మీద చూపిస్తాడు. ఫోర్మన్ అదంతా పనివాడిమీద వెళ్లదీస్తాడు. ఆ పనివాడు తన భార్యపై అరుస్తాడు. ఆ భార్య పిల్లలపై అరుస్తుంది. ఈ ప్రతి ఉదంతంలో, ఎక్కడ కోపం ప్రదర్శిస్తే ప్రమాదకరమో, ఎక్కడ ఫరవాలేదో బుద్ధి నిర్ణయిస్తుంది. మానవులలో బుద్ధి అనేది మనస్సుని నియంత్రించగలదు అని ఈ ఉదాహరణ మనకు తెలియచేస్తున్నది.
ఈ విధంగా, మనం బుద్ధిని సరియైన జ్ఞానంచే పెంపొందించుకోవాలి మరియు దానిని మనస్సుని సరియైన దిశలో పెట్టడానికి ఉపయోగించుకోవాలి. శ్రీ కృష్ణుడు చెప్పే బుద్ధి యోగము అంటే ఇదే - అన్ని వస్తువులు మరియు పనులు భగవంతుని ప్రీతికోసమే, ఆయన సంతోషం కొరకే ఉన్నాయనే, దృఢ సంకల్పము బుద్ధి యందు పెంపొందించుకోవటం అన్నమాట. దృఢ సంకల్పబుద్ధి ఉన్న ఇటువంటి వ్యక్తి యొక్క చిత్తము, సునాయాసముగానే భగవంతుని పట్ల అనుసంధానమైపోతుంది.