Bhagavad Gita: Chapter 18, Verse 59

యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ।। 59 ।।

యత్ — ఒకవేళ; అహంకారమ్ — అహంకారము చే ప్రేరితమై; ఆశ్రిత్య — ఆశ్రయిస్తే; న యోత్స్యే — నేను యుద్ధం చేయను; ఇతి — ఈ విధంగా; మన్యసే — నీవు అనుకుంటే; మిథ్యా-ఏషాః — ఇదంతా అబద్ధము; వ్యవసాయః — దృఢ సంకల్పము; తే — నీ యొక్క; ప్రకృతిః — భౌతిక స్వభావము; త్వాం — నీవు; నియోక్ష్యతి — నిమగ్నమౌతావు.

Translation

BG 18.59: ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క స్వంత (క్షత్రియ) భౌతిక స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది.

Commentary

మందలిస్తున్న తరహాలో మాట్లాడుతూ, శ్రీ కృష్ణుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఏది నచ్చితే అది చేయటానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని మనం ఎన్నడూ అనుకోకూడదు. ఆత్మ అనేది పూర్తి స్వతంత్రమమైన అస్తిత్వమును కలిగి ఉండదు. అది భగవంతుని సృష్టిపై ఎన్నో విధాలుగా ఆధారపడి ఉంటుంది. భౌతిక బద్ధ స్థితిలో, అది ప్రకృతి త్రిగుణముల ఆధీనములో ఉంటుంది. ఈ గుణముల సంయోగమే మన స్వభావాన్ని ఏర్పరుస్తుంది, మరియు అది ఆదేశించినట్టుగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి, మనకు ‘నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను’ అని అనే పరిపూర్ణ స్వేచ్ఛ లేదు. భగవంతుని యొక్క మరియు శాస్త్రముల సత్-సందేశాన్ని లేదా ప్రకృతి యొక్క బలవంత ఒత్తిడిని ఈ రెంటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవల్సి ఉంటుంది.

వ్యక్తి స్వభావంపై ఒక ఆఖ్యానం ప్రాచుర్యంలో ఉంది:

ఒక సైనికుడు ముప్పై సంవత్సరముల సర్వీసు తరువాత తన సొంత ఊరికి వచ్చాడు. ఒక రోజు, ఆయన కాఫీ దుకాణంలో నిల్చుని ఓ కప్పు టీ త్రాగుతూ ఉండగా, ఆయన స్నేహితుడు ఒక పరిహాసం చేద్దామనుకున్నాడు. ఆయన వెనుక ఉండి, ‘అటెన్షన్!’ అని గట్టిగా అరిచాడు. ఆ పిలుపుకి బదులివ్వటం ఆ సైనికుడి సహజ స్వభావమైపోయింది. అప్రయత్నంగానే, చేతిలో నుండి కప్పు పడేసి, నిటారుగా చేతులు పక్కకుపెట్టి నిల్చున్నాడు.

స్వభావసిద్ధంగా అర్జునుడు ఒక యోధుడు, ఒకవేళ గనక అహంకారముతో, మంచి సలహాని పాటించను అని ఆయన నిర్ణయించుకున్నా, అతని యొక్క క్షత్రియ స్వభావము ఆయనను తప్పకుండా యుద్ధానికి ప్రేరేపిస్తుంది.