మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ।। 65 ।।
మత్-మనా — నన్ను స్మరిస్తూ; భవ — ఉండుము; మత్-భక్తః — నా భక్తుడిగా; మత్-యాజీ — నన్నే పూజింపుము; మాం — నాకు; నమస్కురు — నమస్కరించుము; మామ్ — నన్ను; ఏవ — నిజముగా; ఏష్యసి — చేరెదవు; సత్యం — సత్యముగా; తే — నీకు; ప్రతిజానే — వాగ్దానం చేస్తున్నాను; ప్రియః — ప్రియమైనవాడివి; అసి — నీవు; మే — నాకు.
Translation
BG 18.65: ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
Commentary
9వ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానమును తెలియచేస్తానని వాగ్దానం చేసాడు, మరియు ఆ తర్వాత భక్తి యొక్క ప్రాశస్త్యమును చెప్పాడు. ఇక్కడ, తన పట్ల భక్తితో నిమగ్నమవ్వమని చెప్తూ, 9.34వ శ్లోకం యొక్క మొదటి పాదాన్ని తిరిగి పేర్కొన్నాడు. శ్రీ కృష్ణుడి పట్ల గాఢమైన ప్రేమను పెంపొందించుకుని మరియు తన యొక్క మనస్సు సతతమూ అనన్య భక్తితో ఆయన యందే నిమగ్నం చేయటం వలన, అర్జునుడు ఖచ్చితంగా సర్వోన్నత గమ్యమును చేరుకోగలడు.
సంపూర్ణముగా భక్తిలో నిమగ్నమైనవానికి ఉన్న ఒక చక్కటి ఉదాహరణ, అంబరీష మహారాజు. శ్రీమద్భాగవతం ఇలా వివరిస్తుంది:
స వై మనః కృష్ణ-పదారవిందయోః
వచాంసి వైకుంఠ-గుణానువర్ణనే
కరౌ హరేర్ మందిర-మార్జనాదిషు
శ్రుతిం చకారాచ్యుత-సత్-కథోదయే
ముకుంద-లింగాలయ-దర్శనే దృశౌ
తద్-భృత్య-గాత్ర-స్పర్శే అంగసంగమం
ఘ్రాణం చ తత్-పాద-సరోజ-సౌరభే
శ్రీమత్-తులస్యా-రసనాం తద్-అర్పితే
పాదౌ హరేః క్షేత్ర-పదానుసర్పణే
శిరో హృషీకేశ-పదాభివందనే
కామం చ దాస్యే న తు కామ-కామ్యయా
యథోత్తమశ్లోక-జనాశ్రయా రతిః (9.4.18-20)
‘అంబరీషుడు తన మనస్సును శ్రీ కృష్ణుడి పాదారవిందముల మీదనే నిమగ్నం చేసాడు; తన వాక్కుని భగవంతుని గుణములను కీర్తించటానికే వాడాడు, తన చేతులను దేవాలయమును శుభ్రం చేయటానికే వాడాడు, తన చెవులను భగవత్ దివ్య లీలలను వినటానికే వాడాడు. తన కన్నులను దివ్యమంగళ విగ్రహాలను దర్శించటంలోనే నిమగ్నం చేసాడు. తన శరీర అంగములను భక్తుల సేవకే వాడాడు, తన ముక్కుని భగవంతుని పాదార విందముల వద్ద అర్పించిన తులసీ దళములను ఆఘ్రాణించటానికే వాడాడు, మరియు తన నాలుకను భగవత్ ప్రసాదమును రుచి చూడటానికే వాడాడు. తన కాళ్ళను పుణ్య ప్రదేశాలకు వెళ్ళటానికి, తన శిరస్సుని భగవత్ పాదార విందముల వద్ద ప్రణమిల్లటానికి ఉపయోగించాడు. పూల దండలూ, చందనము వంటి సరంజామా అంతటినీ, భగవత్ సేవకే వాడాడు. ఇవన్నీ ఏదో స్వార్థ ప్రయోజనం కోరి కాకుండా, చిత్తశుద్ధి ద్వారా, కేవలం, శ్రీ కృష్ణుడి నిస్వార్థ సేవ పొందటానికే చేసాడు.’
హృదయ పూర్వకముగా భక్తిలో నిమగ్నమవ్వమని చెప్పే ఉపదేశమే, సమస్త శాస్త్రముల యొక్క సారాంశము మరియు సమస్త జ్ఞానము యొక్క సారము. అయినా, శ్రీ కృష్ణుడు పేర్కొన్న, అత్యంత గోప్యమైన జ్ఞానము ఇది కాదు, ఎందుకంటే దీనిని కృష్ణుడు ఇంతకు పూర్వమే చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు తన అత్యున్నత రహస్యమును తదుపరి శ్లోకంలో చెప్తున్నాడు.