Bhagavad Gita: Chapter 18, Verse 67

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ।। 67 ।।

ఇదం — ఇది; తే — నీ చేత; న — కూడదు; అతపస్కాయ — తపస్సంపన్నులు కాని వారికి; న — కూడదు; అభక్తాయ — భక్తులు కాని వారికి; కదాచన — ఎప్పుడూ; న — కూడదు; చ — మరియు; అశుశ్రూషవే — వినటానికి (ఆధ్యాత్మిక విషయాలు) ఏవగింపు కలిగేవారికి; వాచ్యం — చెప్పుట; న — ఎప్పుడూకూడదు; చ — మరియు; మాం — నా పట్ల; యః — ఎవరైతే; అభ్యసూయతి — అసూయ/ఈర్ష్య కలవారికి.

Translation

BG 18.67: ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికి, లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. (ఆధ్యాత్మిక విషయములు) వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ముఖ్యంగా, నాపట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు.

Commentary

భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తిలో నిమగ్నమైన వారు ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టినా పాపం లేదు అని ఇంతకు క్రితం శ్లోకంలో వివరించబడినది. కానీ, ఈ ఉపదేశంలో ఒక సమస్య ఉన్నది. ఒకవేళ మనం ఇంకా భగవంతుని పట్ల ప్రేమలో స్థిరంగా లేకపోతే, మరియు తొందరపడి ముందరగానే భౌతికప్రాపంచిక ధర్మములను విడిచి పెడితే, మనం అటూ ఇటూ కాకుండా పోతాము. అందుకే, కర్మ సన్న్యాసం అంటే, దానికి తగిన అర్హత ఉండాలి. మనకు దేనికి అర్హత ఉన్నదో మన గురువు గారు నిర్ణయిస్తారు, ఆయనకే మన సామర్థ్యము మరియు ఆయా మార్గాల్లో ఉండే కాఠిన్యములు తెలుస్తాయి. ఒకవేళ ఒక విద్యార్థి పట్టభద్రుడు కావాలనుకుంటే, నేరుగా వెళ్లి స్నాతకోత్సవంలో కూర్చుంటే కుదరదు. ఒకటో తరగతి నుండి క్రమక్రమంగా మొదలుపెట్టాలి. అదే విధంగా, అత్యధిక జనులకు కర్మ యోగమునకే అర్హత ఉంటుంది, మరియు తొందరపడి అకాలముగా కర్మ సన్యాసము తీసుకొనుట, పెద్ద తప్పే అవుతుంది. తమ శారీరక ధర్మములను నిర్వర్తిస్తూనే, దానితో పాటుగా భక్తిని అభ్యాస సాధన చేయమని చెప్పటమే మంచిది. అందుకే, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, తాను చెప్పిన ఈ రహస్య జ్ఞానము అందరికోసం కాదు అని చెప్తున్నాడు. ఇతరులతో పంచుకునే ముందు, ఈ ఉపదేశం అందుకోవటానికి, వారి యొక్క అర్హతను పరీక్షించాలి.

ఈ హెచ్చరిక, మరింత ప్రత్యేకంగా ఇంతకు క్రితం శ్లోకానికి వర్తిస్తుంది మరియు సాధారణంగా భగవద్గీత మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ దీనిని, శ్రీ కృష్ణుడు అంటే అసూయ/ఈర్ష్య కలిగిన వారికి చెప్తే, ఆ వ్యక్తి ఇలా అనవచ్చు, ‘శ్రీ కృష్ణుడు చాలా దురహంకారముగలవాడు. అర్జునుడిని పదేపదే తనను కీర్తించమని చెప్తున్నాడు.’ అని. ఈ ఉపదేశాలను తప్పుగా అర్థం చేసుకుని, విశ్వాసరహితుడు, ఈ దివ్య ఉపదేశం వలన ఇంకా హాని పొందుతాడు. పద్మ పురాణం కూడా ఇలా చెప్తున్నది:

అశ్రద్ధధానే విముఖే ఽపి అశృణ్వతి

యష్ చోపదేశః శివ-నామాపరాధః

‘విశ్వాసం లేనివారికి మరియు భగవంతుని పట్ల ఏవగింపు కలవారికీ, అలౌకిక ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇవ్వటం ద్వారా వారిని అపరాధులుగా చేసినట్టు అవుతుంది.’ కాబట్టి, శ్రీ కృష్ణుడు, వినేవారికి ఉండే అనర్హతలని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.