యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ।। 78 ।।
యత్ర — ఎక్కడైతే; యోగ-ఈశ్వరః — యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు; కృష్ణః — శ్రీ కృష్ణ; యత్ర — ఎక్కడైతే; పార్థః — అర్జునుడు, ప్రిథః పుత్రుడు; ధనుః-ధరః — అత్యుత్తమ విలుకాడు; తత్ర — అక్కడ; శ్రీః — సిరిసంపదలు; విజయః — విజయము; భూతిః — అభ్యుదయము; ధ్రువా — అనంతమైన; నీతిః — ధర్మము; మతిః-మమ — నా అభిప్రాయము.
Translation
BG 18.78: ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.
Commentary
ఈ శ్లోకంతో, ఒక గంభీరమైన ప్రకటన ఇస్తూ భగవద్గీత ముగుస్తున్నది. ధృతరాష్ట్రుడు యుద్ధం యొక్క పరిణామం/ఫలితం పట్ల ఆందోళనతో ఉండినాడు. రెండు సైన్యముల పరస్పర భౌతిక పరమైన సామర్థ్యముల లెక్కలు వ్యర్థమని సంజయుడు అతనికి చెప్తున్నాడు. ఈ యుద్ధంలో ఒక్కటే తీర్పు ఉంటుంది - విజయం ఎల్లప్పుడూ భగవంతుడు మరియు అతని శుద్ధ భక్తుడు ఉన్న పక్షమే ఉంటుంది; అదే పక్షాన మంచితనమూ, ఆధిపత్యము, మరియు సమృద్ధి కూడా ఉంటాయి.
భగవంతుడు సర్వ స్వతంత్రుడు, స్వయం సమృద్ధిగల జగదీశ్వరుడు, మరియు అర్చన-ఆరాధనలకు అత్యంత యోగ్యుడు. న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే (శేతాశ్వాతర ఉపనిషత్తు 6.8) ‘ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరు; ఆయనకంటే గొప్పవారు ఎవరూ లేరు;’ తన అసమానమైన మహిమను ప్రకటించటానికి తగిన వాహకం ఆయనకు కావాలి. ఆయనకు శరణాగతి చేసిన జీవాత్మ, భగవంతుని యశస్సుని ప్రకాశింపచేయటానికి అటువంటి ఒక చక్కటి వాహకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా, ఎక్కడైతే సర్వోత్కృష్ట పరమేశ్వరుడు మరియు ఆయన యొక్క పరిపూర్ణ భక్తుడు ఉంటారో, పరమ సత్యము యొక్క తేజస్సు ఎల్లపుడూ అసత్యపు చీకటిని జయిస్తుంది. ఇంకే ఇతర ఫలితమూ ఉండజాలదు.