Bhagavad Gita: Chapter 2, Verse 1

సంజయ ఉవాచ ।
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ ।
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।। 1 ।।

సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; తం — అతనితో (అర్జునుడి తో); తథా — ఈ విధంగా; కృపయా — జాలితో; ఆవిష్టం — నిండినవాడై; అశ్రు-పూర్ణ — కన్నీరు-నిండి; ఆకుల — వ్యాకులతతో; ఈక్షణం — కళ్ళు; విషీదంతం — శోకంతో; ఇదం — ఈ యొక్క; వాక్యం — మాటలు; ఉవాచ — పలికెను; మధుసూదనః — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించిన వాడు.

Translation

BG 2.1: సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.

Commentary

అర్జునుడి మనో భావాలని వర్ణించడానికి సంజయుడు, 'కృపయా', అంటే జాలి లేదా కరుణ, అన్న పదం వాడాడు. కారుణ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి - ఈశ్వర వియోగము వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి - ఎదుటివారిలో భౌతిక శారీరక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక ఉత్తమ భావమే కానీ అది సంపూర్ణంగా సరియైన దిశలోనే ఉన్నటువంటిది అని చెప్పలేము. అది, కారులో కూర్చున్న డ్రైవర్ కృశించి పోతుంటే, కారు పరిస్థితి గురించి ఆందోళన చెందినట్టుగా ఉంటుంది. అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావాన్ని అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకంతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తే, అతనికే కారుణ్యం/జాలి యొక్క తీవ్ర అవసరం ఉంది అని తెలుస్తోంది. కాబట్టి తనే ఇతరుల మీద దయతో ఉంటున్నాడు అని అనుకోవటం అర్థరహితమైనది.

ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ‘మధుసూదన’ అని పిలవబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ, అర్జునుడి మనస్సులో జనించిన, స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగావున్న, అనుమానపు రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు.

Watch Swamiji Explain This Verse