Bhagavad Gita: Chapter 2, Verse 22

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 22 ।।

వాసాంసి — వస్త్రములు; జీర్ణాని — జీర్ణమైపోయిన (పాతబడ్డ); యథా — ఆ విధముగా; విహాయ — విడిచిపెట్టి; నవాని — కొత్త; గృహ్ణాతి — స్వీకరించును; నరః — మానవుడు; అపరాణి — వేరైన; తథా — అదే విధముగా; శరీరాణి — శరీరములు; విహాయ — విడిచిపెట్టి; జీర్ణాని — పాతబడ్డ; అన్యాని — వేరే; సంయాతి — ప్రవేశించును; నవాని — కొత్త; దేహీ — జీవాత్మ.

Translation

BG 2.22: ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా, మరణ సమయములో, జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.

Commentary

ఆత్మ స్వభావాన్ని వివరించటం కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు, పునర్జన్మ సిద్ధాంతాన్ని, మనం చేసే రోజువారీ పనితో పోల్చుతూ పునరుద్ఘాటిస్తున్నాడు. వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము, కానీ ఈ ప్రక్రియలో మనం మారిపోము. ఇదే విధంగా, ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు.

పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి 'న్యాయ దర్శన్' ఈ క్రింది వాదనని చెపుతోంది.

జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18)

మీరు చిన్న శిశువుని గమనిస్తే, ఏ పత్యేకమైన కారణం లేకుండానే, అది ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శన్' ప్రకారం, ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ, ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ మనోముద్రలు మనస్సులో బలంగా ముద్రింపబడటం వలన అవి చాలామటుకు గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక, జనన, మరణ ప్రక్రియలు ఆత్మకి ఎంత బాధాకరమైనవి అంటే, అవి పూర్వ జన్మ స్మృతులను చాలా మేర తుడిచివేస్తాయి.

న్యాయ దర్శన్ పునర్జన్మకి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటోంది: స్తన్యాభిలాషాత్ (3.1.21). అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు, తల్లి తన స్తనాన్నిబిడ్డ నోట్లో పెట్టినప్పుడు శిశువుకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ, అప్పుడే పుట్టిన శిశువు ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో సైతం, ఆయా తల్లుల స్తనాలు, చనుమొనలు, మరియు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు, ఆ శిశువు తనంతటతానే గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.

పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే, మనుష్యుల మధ్య ఉన్నఅసమానతన అనేది, కారణం చెప్పడానికి వీలు కాకుండా మరియు అసంబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డి వాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే, తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మఫలం వలన ఇలా జరిగింది అంటే, అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే, అది కూడా నమ్మశక్యంగానిదే, ఎందుకంటే భగవంతుడు పరమ దయ కలవాడు, నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డి వాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వ-జన్మ కర్మల ఫలితంగా గుడ్డి వాడిగా పుట్టాడు. అందువలన, సహజ-వివేకము మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.