అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ।। 28 ।।
అవ్యక్త-ఆదీని — పుట్టుక ముందు అవ్యక్తములు (అప్రకటితములు); భూతాని — సృష్టింపబడిన ప్రాణులు; వ్యక్త — వ్యక్తములు (ప్రకటితములు); మధ్యాని — మధ్యలో; భారత — అర్జున, భరత వంశీయుడా; అవ్యక్త — అవ్యక్తములు (అప్రకటితములు); నిధనాని — మరణించిన పిమ్మట; ఏవ — నిజముగా; తత్ర — కాబట్టి; కా — ఎందులకు; పరిదేవనా — శోకించుట.
Translation
BG 2.28: ఓ భరత వంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు?
Commentary
ఆత్మకి సంబంధించి ఉన్న శోక కారణాన్ని 2.20వ శ్లోకంలో, శరీరానికి సంబంధించి ఉన్న శోక కారణాన్ని 2.27వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు పోగొట్టాడు. ఇప్పుడు రెంటినీ ఈ శ్లోకంలో పొందుపరిచాడు. శ్రీమద్భాగవతంలో నారద మహర్షి, యుధిష్ఠిరుడికి ఈ విధంగానే ఉపదేశించాడు.
యన్ మన్యసే ధృవం లోకం అధృవం వా న చోభయమ్
సర్వథా న హి శోచ్యాస్తే స్నేహదన్యత్ర మొహజాత్ (1.13.43)
‘నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించినా లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా లేదా ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరముల మిశ్రమంగా భావించినా, నీవు శోకించతగదు. శోకమునకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే.’
భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది - స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.
స్థూల శరీరం: పంచ భూతములతో తయారు చేయబడినది — భూమి, నీరు, అగ్ని, గాలి, మరియు ఆకాశము
సూక్ష్మ శరీరం: పద్దెనిమిది మూల-వస్తువులతో కూడినది - ఐదు ప్రాణవాయువులు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, మరియు అహంకారం.
కారణ శరీరం: అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి, మునుపటి జీవితాల నుండీవున్న సంస్కారములతో కూడి ఉన్నది.
మరణ సమయంలో, ఆత్మ, తన స్థూల శరీరాన్ని విడిచి పెట్టి, తనతో పాటు సూక్ష్మ, కారణ శరీరములను తీస్కుని వెళుతుంది. అటుపిమ్మట, భగవంతుడు మరల ఆత్మకి మరియొక స్థూల శరీరాన్ని, దాని సూక్ష్మ, కారణ శరీరాల అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భం లోనికి ప్రవేశపెడతాడు. ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలి వేసిన తరువాత, వేరే స్థూల శరీరాన్ని తీస్కునే మధ్యలో ఒక పరివర్తన దశ (transitional phase) ఉంటుంది. ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు. కాబట్టి పుట్టుక ముందు, ఆత్మ, అవ్యక్తమైన సూక్ష్మ, కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది (ప్రకటితమవుతుంది). కాబట్టి, శోకించటానికి మరణం కారణం కారాదు.