Bhagavad Gita: Chapter 2, Verse 5

గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే ।
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ।। 5 ।।

గురూన్ — గురువులు; అహత్వా — చంపకుండా; హి — నిజముగా; మహానుభావాన్ — మహనీయులైన పెద్దలు; శ్రేయః — మేలు; భోక్తుం — భోగాలని అనుభవించటం; భైక్ష్యమ్ — బిచ్చమెత్తుకుని; అపి — అయినాసరే; ఇహ లోకే — ఈ లోకంలో; హత్వా — సంహరించుట; అర్థ — సంపాదించు; కామాన్ — కోరికతో; తు — కానీ; గురూన్ — గురువులను (పెద్దవారిని); ఇహ — ఈ లోకంలో; ఏవ — తప్పకుండా; భుంజీయ — అనుభవించుట; భోగాన్ — భోగములు (విలాసములు) రుధిర — రక్తం; ప్రదిగ్ధాన్ — కళంకితమై ఉన్న.

Translation

BG 2.5: నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తంతో కళంకితమై ఉంటాయి.

Commentary

అర్జునుడు తన జీవనోపాధి కొనసాగించటం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు. కానీ ఇక్కడ అర్జునుడు ఆ వాదనని తిప్పికొడుతున్నాడు. భిక్షాటన చేసైనా జీవిస్తాను కానీ ఈ నీచమైన నేరాన్ని మాత్రం చేయను అని అంటున్నాడు. ఒకవేళ, యుద్దం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటం అనే ఈ హీనమైన పని చేసినా తన అంతరాత్మ తనను, ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము, అధికారము వంటి ఫలములను అనుభవించనీయదు అని విశ్వసిస్తున్నాడు.

షేక్స్పియర్ (ఒక గొప్ప ఆంగ్ల రచయిత) నాటకం ‘మక్‌బెత్’ ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని ప్రస్తావిస్తుంది. అందులో, ఒక వ్యక్తి, అంతఃకరణలో నేరం చేసిన భావన వలన, తన సహజమైన నిద్రని కూడా పొందలేకపోతాడు; ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ధనము, అధికారం గురించి ఏమి చెప్పాలి? మక్‌బెత్, స్కాట్లాండ్‌లో ఒక ఉన్నతమైన వ్యక్తి. ఒకసారి, స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వచ్చాడు. రాజుని హత్య చేసి అతని సింహాసనాన్ని లాక్కోవటానికి మక్‌బెత్ భార్య అతన్ని పురికొల్పింది. భార్య సలహాకి ప్రభావితమై మక్‌బెత్, రాజుని హత్య చేసాడు. దీనితో, మక్‌బెత్, అతని భార్య, స్కాట్లాండ్ మహారాజు, మహారాణిలుగా పట్టాభిషిక్తులైనారు. కానీ, ఎన్నో సంవత్సరాల తరువాత కూడా, మక్‌బెత్ తన భవంతిలో రాత్రి పూటకూడా పూర్తిగా లేచి ఉండి అటూ ఇటూ నడుస్తూ కనిపించేవాడు. ఆ రచయిత ఇలా రాసాడు, ‘మక్‌బెత్ నిద్రను చంపాడు, కాబట్టి మక్‌బెత్ ఇక నిద్రపోలేడు’ (Macbeth hath killed sleep, and so Macbeth shall sleep no more). మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది, అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నదా అన్నట్టుగా. ఈ శ్లోకంలో, అర్జునుడు విచారించేదేమిటంటే, అతను గౌరవనీయులైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించినా, మహారాజులకు అందుబాటులో ఉండే రాజ భోగాలను, అవి రక్తంతో కళంకితమైనందున, తన అంతఃకరణ, వాటిని అనుభవించనీయదు అని.

Watch Swamiji Explain This Verse