Bhagavad Gita: Chapter 2, Verse 51

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ।। 51 ।।

కర్మ-జం — కర్మల వలన జనించే; బుద్ధి-యుక్తాః — సమత్వ బుద్ధి కలవారై; హి — ఎట్లయితే ; ఫలం — ఫలములు; త్వక్త్వా — విడిచిపెట్టి; మనీషిణః — జ్ఞానులు; జన్మ-బంధ-వినిర్ముక్తాః — జీవన్మరణ బంధముల నుండి విముక్తులై; పదం — స్థితి; గచ్ఛంతి — పొందుదురు; అనామయమ్ — దుఃఖరహితమైన.

Translation

BG 2.51: జ్ఞానులు, సమత్వ బుద్ధి కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పని చేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు.

Commentary

ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పటం కొనసాగిస్తూ, అది వ్యక్తిని బాధా-రహిత స్థితికి చేరుస్తుందని శ్రీ కృష్ణుడు మరింత పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుద్ధ్యము ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది, ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది, జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము. భాగవతంలో ఇలా చెప్పబడింది:

సుఖాయ కర్మాణి కరోతి లోకో

న తైస్సుఖం వాన్యదుపారమం వా

విందేత భూయాస్తత ఏవ దుఃఖం

యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః (3.5.2)

 

‘ప్రతి ఒక్క వ్యక్తీ ఆనందం కోసం కామ్య కర్మలను చేస్తూనే ఉంటాడు, కానీ తృప్తి లభించదు. సరికదా ఈ పనులు దుఃఖాన్ని మరింత పెంచుతాయి.’ ఈ కారణంగా, ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ స్వంత శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు; మరికొందరు తమ స్వజనులు, బంధువులచే బాధింపబడుతున్నారు; మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంతో బాధ పడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి, తాము సంతోషంగా లేము అని తెలుసు, కానీ తమ కన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకోని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మల నుండీ సాగుతూనే ఉంది కానీ ఎక్కడా దీనికి అంతమే కనిపించటం లేదు. ఇప్పుడు లోకులు కామ్య కర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే, అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్థకమైనదని అర్థం చెసుకుని, ఆధ్యాత్మిక జీవనం వైపు తమ తమ జీవితాన్ని యూ-టర్న్ తిప్పుకునేందుకు ఆలోచిస్తారు.

ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వ కార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు. ఆ కారణంగా, వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి, అంతా భగవంతునికి సమర్పించి, మరియు ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదం (అనుగ్రహం)లా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయటం వలన, వారి పనులు జనన-మరణ చక్రంలో పడవేసే కర్మ బంధాలను కలుగచేయవు.