విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59 ।।
విషయాః — ఇంద్రియ విషయములు; వినివర్తంతే — నిగ్రహించు; నిరాహారస్య — స్వీయ సంయమం పాటించి; దేహినః — జీవాత్మకి; రస-వర్జం — రుచి తరిగిపోవుట; రసః — రుచి; అపి — కూడా; అస్య — అతనికి; పరం — పరమాత్మ; దృష్ట్వా — తెలుసుకున్న పిదప ; నివర్తతే — తరిగి పోవును.
Translation
BG 2.59: సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా కానీ, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును.
Commentary
ఉపవాస సమయంలో, ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదే విధంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, భోగ విషయ/వస్తువులపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి ఎందుకంటే కోరికల బీజం మనస్సులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు, ఆయా కోరికలు తిరిగి వస్తాయి.
ఈ కోరికల మూల బీజం ఏమిటి? జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అణు-అంశము, అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం, ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించేవరకూ జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్పశక్తిచే ఇంద్రియములను నియంత్రించవచ్చు, కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు. కానీ, జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై, దివ్య ఆనందాన్ని పొందినప్పుడు, తాను అనంతమైన జన్మలనుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
రసోవై సః రసమ్ హ్యేవాయం లబ్ధ్వా ఽనందీ భవతి (2.7.2)
‘భగవంతుడు పూర్ణ-ఆనందమయుడు. జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు, ఆ ఆనందంలో తనివి తీరుతుంది.’ ఆ తర్వాత సహజంగానే నిమ్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవత్ భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది.
ఈ విధంగా భగవద్గీత, కేవలం కోరికలను అణచివేయమని చెప్పలేదు, నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే అందమైన మార్గాన్ని ఉపదేశించింది. రామకృష్ణ పరమహంస మాహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పాడు , ‘భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపై ప్రేమ; మరియు నిమ్నస్థాయివి వాటంతట అవే వీగిపోతాయి’ (‘Devotion is love for the highest; and the lowest shall fall away by itself.’)