Bhagavad Gita: Chapter 2, Verse 6

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః ।
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ।। 6 ।।

న — కాదు; చ — కూడా; ఎతత్ — ఇది; విద్మః — మనకు తెలుసు; కతరత్ — ఏది; నః — మనకు; గరీయః — మంచిది; యత్ వా — ఒకవేళ లేదా; జయేమ — మనము విజేయులమైతామో; యది — ఒకవేళ; వా — లేదా; నః — మనలను; జయేయుః — వారు జయిస్తారో; యాన్ — ఎవరినైతే; ఎవ — నిజముగా; హత్వా — సంహరించిన తరువాత; న జిజీవిశామః — జీవించి ఉండబుద్ధి కాదు; తే — వారు; అవస్థితాః — నిలిచియున్నారు; ప్రముఖే — మన ముందు; ధార్తరాష్ట్రాః — ధృతరాష్ట్రుని కుమారులు.

Translation

BG 2.6: ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు - వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా. వారిని సంహరించిన తరువాత కూడా, మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు.

Commentary

పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలలో, ప్రత్యామ్నాయాలను వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి. కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మధన పడుతున్నాడు. రెండు పరిణామాలు ఓటమి గానే తోచాయి, ఎందుకంటే, కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఇక ఉండదు.

కానీ, భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు కృపాచార్యుడు మొదలైనవారు అల్పబుద్ధితో కౌరవుల అధర్మ పక్షమున చేరి ఉన్నారు. వారి కోసం ‘అర్థకామ్’ అన్న పదం వాడబడింది, అంటే ‘ధనము, అధికారాములపై ఆసక్తితో ఉండి’ అని, ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధనుని పక్షంలో చేరారు. కాబట్టి, వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేదే. నిజానికి, నీచ బుద్ధితో ప్రవర్తించిన గురువు, వదిలి వేయబడటానికి తగిన వాడే అని, యుద్ధం తరువాత, స్వయంగా భీష్ముడే అంగీకరించాడు.

ఈ సందర్భంలో, భీష్ముడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది. శ్రీమద్ భాగవతం ప్రకారం (9.22.19వ శ్లోకం) అతను శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. అతను ఇంద్రియములను జయించినవాడు మరియు శూరత్వానికి, సహృదయానికి ప్రతీక. పరమ సత్యాన్ని తెలిసిన వారిలో ఒకడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాననే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మృత్యువు కూడా, అతను సంకల్పించి స్వీకరించినప్పుడే ఆయన దరికి వస్తుంది. చాలా కారణాల వలన భీష్ముడు, పన్నెండు మంది మహోన్నత వ్యక్తులలో (మహాజనులు) ఒకడిగా పరిగణించబడ్డాడు. భాగవతంలో ఈ విధంగా ఉంది.

స్వయంభూర్ నారదః శంభుః కుమారః కపిలో మనుః
ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వైయాసకిర్ వయం (6.3.20)

‘భాగవత ధర్మములు యథార్థముగా తెలిసినవారు ఈ పన్నెండుగురు - మొట్టమొదట జన్మించిన బ్రహ్మదేవుడు, నారద ముని, శంకర భగవానుడు, నలుగురు కుమార ఋషులు, కపిల భగవానుడు (దేవహూతి తనయుడు), స్వాయంభువ మనువు, ప్రహ్లాద మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలి చక్రవర్తి, శుకదేవ ముని, మరియు వేద వ్యాసుడు.’

కాబట్టి, భీష్ముడు మహా జ్ఞాని, అతని ఏ పని కూడా ధర్మ-విరుద్ధంగా ఉండదు. అయినప్పటికీ, అతని గంభీరమైన వ్యక్తిత్వం ప్రాపంచిక తర్కానికి అతీతమైనవి. అతను కౌరవుల పక్షాన పోరాడినా, యుధిష్ఠిరుడితో (పాండవ అన్నదమ్ములలో పెద్దవాడు) యుద్ధం ముందు ఈ విధంగా అన్నాడు, ‘నేను అధర్మ పక్షాన పోరాడటానికి బద్ధుఁడనైయున్నాను, కానీ మీరే విజేయులౌతారు అని వరమిస్తున్నాను.’ అని. భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరు అని భీష్ముడికి తెలుసు. తను అధర్మ పక్షాన ఉండి, ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మ యుద్ధంలో దుర్మార్గమును గెలిపింపలేదు అని నిరూపించాడు. ఈ విధంగా తన ప్రాణాలనే త్యాగం చేస్తూ శ్రీ కృష్ణుని దివ్య లీలల యందు తన వంతు సహకరించాడు.

కౌరవుల పక్షంలో ఉండి పోరాడినా, భీష్ముడికి తనపై ఉన్న ప్రగాఢ భక్తి, శ్రీ కృష్ణుడికి తెలుసు. అందుకే, భీష్ముడి ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞనే భంగం చేసుకున్నాడు. యుద్ధంలో ఒకానొక రోజు, మరుసటి రోజు సూర్యాస్త సమయానికల్లా, తాను పాండవ ముఖ్యుడు అర్జునుడిని సంహరిస్తాను లేదా అతనిని కాపాడటానికి శ్రీ కృష్ణుడు, మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను అనే తన సంకల్పాన్ని భంగం చేయాలి, అని భీష్ముడు ప్రతిజ్ఞ చేసాడు. భీష్ముడి ప్రతిజ్ఞని కవులు ఈ విధంగా వర్ణించారు.

ఆజు జో హరిహిఁ న శస్త్ర గాహాఊఁ
తౌ లాజహుఁ గంగా జననీ కో శాంతను సుత న కహాఊఁ

(సూరదాస్)

‘భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మచే నేను ఆయుధం పట్టనీయకపొతే, నా తల్లి గంగాదేవికి సిగ్గుచేటే, నేను శంతను మహారాజు పుత్రుడనే కాదు.’ భీష్ముడు ఎంత పరాక్రమంతో పోరాడాడంటే, అర్జునుడి రథం ముక్కలు-ముక్కలు అయిపోయింది, అర్జునుడు నేల మీద నిలబడ్డాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి, భీష్ముడిని, అర్జునుడిని చంపకుండా నిలువరించడానికి ముందుకు ఉరికాడు. చేతిలో రథచక్రమే ఆయుధముగా ఉన్న భగవంతుడిని చూసి భీష్ముడు ఎంతో ఆనందపడ్డాడు. భక్తవత్సలుడైన భగవంతుడు తన భక్తుడి మాట నిలబెట్టటం కోసం తన మాటనే పక్కకు పెట్టాడు అని అర్థం చెసుకున్నాడు.

నిజానికి, శ్రీ కృష్ణుడి పట్ల భీష్ముని భక్తి చాలా రసికతతో కూడుకున్నది. ఆయన శ్రీ కృష్ణుడి బృందావన లీలలపై ధ్యానం చేసేవాడు. అక్కడ, గోవులను అడవిలో మేతకి తీసుకెళ్లి సాయంకాలం గ్రామానికి తిరిగి వస్తుండగా, ఆవుల గిట్టల నుండి లేచిన ధూళి ఆ స్వామి ముఖారవిందం పైబడి అది మరింత అందంగా, మధురంగా కనిపించేది. మహాభారత యుద్ధంలో గుర్రాల గిట్టల నుండి లేచిన ధూళి కూడా శ్రీ కృష్ణుడి అందాన్ని ఇనుమడింపచేసింది మరియు తన ప్రభువు దర్శనాన్ని అక్కడ ఆయన ఏంతో ఆస్వాదించాడు.

తన జీవితపు చివరి దశలో, అంపశయ్య (బాణములతో తయారు చేసిన పరుపు) పై ఆరునెలలు పరుండిన భీష్ముడు, స్వామి యొక్క ఆ రూపం పై, ఈ క్రింది ప్రార్థనతో ధ్యానం చేసాడు.

యుధి తురగరజో విధూమ్రవిష్వక్

కచలులిత శ్రమ వార్యలంకృతాస్యే

మమ నిశిత శరైర్విభిద్యమాన

త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా

(భాగవతం 1.9.34)

‘యుద్ధ భూమిలో గుర్రపు గిట్టల నుండి ఎగసిన తెల్లని ధూళి, శ్రీకృష్ణుడి కేశములపై పడి కప్పివేసింది, ఇంకా, రథం నడిపే శ్రమ వలన స్వామి ముఖారవిందము చెమట బిందువులతో ఉన్నది. ఇవి ఆభరణముల వలె నా స్వామి అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి; నా పదునైన బాణముల వలన కలిగిన గాయాలు ఆ అలంకారమును మరింత పెంచుతున్నాయి. అలాంటి శ్రీ కృష్ణుడిని పైనే నా మనస్సు ధ్యానం చేయాలి.’

శ్రీ కృష్ణుడు, ఆయన ప్రేమ, భక్తికి ప్రతిస్పందనగా, అంపశయ్యపై ఉన్న భీష్ముడిని కలవటానికి స్వయంగా విచ్చేసాడు. ఆ భగవంతుడిని కళ్ళెదుటే దర్శిస్తూ, మహాత్ముడు భీష్ముడు స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు.

Watch Swamiji Explain This Verse